రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.25 శాతం రెపోరేటును తగ్గించాయి. రెపో అనుసంధానిత రుణ రేటును పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.35 శాతం నుంచి 8.10 శాతానికి, బ్యాంక్ ఆఫ్ బరోడా 8.15 శాతం నుంచి 7.90 శాతానికి, బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.35 శాతం నుంచి 8.10 శాతానికి సవరించాయి. హోం లోన్ రేట్లు 7.10 శాతం, కార్ లోన్ రేట్లు 7.45 శాతం నుంచి ప్రారంభం అవుతాయని బీవోఎమ్ తెలిపింది.
ఇటీవలే ఆర్‌బీఐ రెపోరేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 5.50 నుంచి 5.25 శాతానికి చేరింది. ఈ క్రమంలోనే లోన్లు తీసుకునే వారికి, తీసుకున్న వారికి ఊరట దక్కింది. ద్రవ్య విధాన కమిటీ మూడు రోజుల సమావేశం తర్వాత ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. కాగా ఫిబ్రవరి, ఏప్రిల్‌లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున, జూన్‌లో 50 పాయింట్లను ఆర్బీఐ తగ్గించింది.