మార్కెట్ విశ్లేషకుల అంచనాలను మరోసారి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నిజం చేసింది. వరుసగా 9వ సారి వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు లేవని ప్రకటించింది. బుధవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మీడియాతో మాట్లాడారు. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను వెల్లడించారు. ఒమిక్రాన్ వ్యాప్తి, అధిక ద్రవ్యోల్బణం భయాల కారణంగా ఈ సారి కూడా కీలక రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదన్నారు. రెపోరేట్, రివర్స్ రెపోరేట్‌లను మార్చకుండా 4 శాతం, 3.35 శాతానికి పరిమితం చేసినట్లు వెల్లడించారు.
అలాగే ఎంఎస్‌ఎఫ్(మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ), బ్యాంక్ రేట్లను 4.25 శాతానికే పరిమితం చేసినట్లు తెలిపారు. కరోనాతో ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచేందుకు చివరిసారి ఆర్‌బీఐ రెపోరేటును మే 2020లో 4 శాతానికి కుదించింది. అప్పటి నుంచి దాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. ఇక కరోనా అనంతరం భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని శక్తికాంత్ దాస్ తెలిపారు. పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గింపు వల్ల.. వాటి డిమాండ్ పెరుగుతుందని శక్తికాంత్ దాస్ అన్నారు. అలాగే నవంబరులో ముడి చమురు ధరలు తగ్గడం సామాన్యులకు ఊరటనిచ్చే అవకాశం ఉందన్నారు. ఇక ద్రవ్యోల్బణం కిందకు దిగొచ్చే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు.