ఒకప్పుడు అత్యంత సంపన్నుల జాబితాలో ముందు వరుసలో నిలిచిన అలీబాబా వ్యవస్థాపకుడు, చైనా కుబేరుడు జాక్ మా.. గత రెండు నెలల నుంచి కనిపించడం లేదు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వబోయి కష్టాలు కొనితెచ్చుకున్నాడు. ప్రభుత్వంతో వివాదం నడుస్తున్న సమయంలో ఆయన అదృశ్యం కావడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన ఆస్తుల విలువ కూడా పడిపోయింది. కొన్నినెలల కిందట 61 బిలియన్ డాలర్లుగా ఉన్న జాక్ మా సంపద ఇప్పుడు 50 బిలియన్ డాలర్లకు కరిగిపోయింది.
అక్టోబరు 2020 షాంఘైలో జరిగిన ఓ కార్యక్రమంలో జాక్ మా మాట్లాడుతూ.. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల తరహాలో వ్యవహరిస్తున్నాయని.. విస్తృత స్థాయిలో ఆలోచించడం అలవర్చుకోవాలని సూచించారు. అంతేకాదు, చైనా ఆర్థిక వ్యవస్థపై విమర్శనాస్త్రాలు సంధించారు. జాక్ మా చేసిన ఈ వ్యాఖ్యలు చైనా అధినాయకత్వానికి కోపం తెప్పించాయి. ఇంకేముంది.. జాక్ మా ను టార్గెట్ చేసింది. ఆయన సంస్థలు, ఆర్థిక కార్యకలాపాలపై నిఘా వేసింది. జాక్ మా ఎదిగేందుకు ఉపకరించే చర్యలను అడ్డుకుంది. జాక్ మాకు చెందిన యాంట్ ఫైనాన్షియల్ ఐపీఓను అడ్డుకోవడం ఈ కోవలోకే వస్తుంది. అలీబాబా సంస్థపై యాంటీ మోనోపలీ విచారణకు ఆదేశించారు. దీని వల్ల ఆ సంస్థ షేర్లు దారుణంగా పడిపోయాయి.
నవంబర్‌లో తాను నిర్వహిస్తున్న టాలెంట్ షో 'ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్' ఫైనల్ ఎపిసోడ్‌కు న్యాయనిర్ణేతగా హాజరుకావాల్సి ఉండగా.. ఆయన రాలేదు. ఆయన స్థానంలో అలీబాబా ఎగ్జిక్యూటివ్ ఆ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అప్పటి నుంచి జాక్ మా కనిపించకుండా పోయారు. ఆసలు ఆయన ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియడంలేదు. ప్రభుత్వంతో వివాదం కొనసాగుతున్న తరుణంలో జాక్ మా కనిపించకుండా పోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.