భారీగా పెరగనున్న ఏసీల ధరలు
AC, TV, washing machine and refrigerator prices to go up soon. తాజాగా ఏసీల ధరలను పెంచేందుకు ఆయా కంపెనీలు రంగం సిద్ధం చేస్తున్నాయి.
By Medi Samrat
ముందే కరోనాతో ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న తరుణంలో ధరలు పెరుగుతుండటంతో మరింత ఇబ్బందుల్లో కూరుకుపోయే పరిస్థితి ఎదురవుతోంది. కష్టకాలం తర్వాత దేశంలో కొన్ని రకాల వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దిశగా వెళ్తుంటే.. తాజాగా ఏసీల ధరలను పెంచేందుకు ఆయా కంపెనీలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే వీటి ధరలు ఒకసారి పెరుగగా, తాజాగా సమ్మర్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ధరలు పెంచేందుకు సిద్దమవుతున్నాయి. అయితే ఏసీ తయారీలో ఉపయోగించే మెటల్, కంప్రెసర్ ధరలు పెరిగాయనే సాకుతో ఏసీల ధరలను పెంచక తప్పందటున్నాయి ఆయా కంపెనీలు.
కాగా, కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది ఉద్యోగులు ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. వేసవి వేడి తగ్గించుకునేందుకు ఏసీలు కొనాలని భావిస్తున్నవారికి ఏసీ ధరలు పెంపుతో షాక్ ఇవ్వనున్నారు.
దాదాపు అన్ని ఏసీ కంపెనీలు 5 నుంచి 8 శాతం మేర ధరలు పెంచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో ధరలు పెంచనున్నట్లు పానసోనిక్ వెల్లడించింది. అలాగే రిఫ్రిజిరేటర్ల ధరలు సైతం 3 నుంచి 4శాతం పెంచనున్నట్లు పానాసోనిక్ సీఈవో మనీశ్ శర్మ తెలిపారు. అలాగే ఏసీల ధరలు పెంచనున్నట్లు డైకిన్ కంపెనీ తెలిపింది. అయితే టాటా సన్స్ గ్రూప్ అనుబంధ వోల్టాస్ సంస్థ ఇప్పటికే ఏసీల ధరలు పెంచేసింది. ముడి సరుకుల ధలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వోల్టాస్ పేర్కొంది. ఇప్పటికే వివిధ శ్రేణి ఏసీలపై 5 నుంచి 8శాతం ధరలను పెంచిన మరో సంస్థ బ్లూస్టార్..మరోసారి వచ్చే నెలలో 3శాతం మేర ధరలు పెంచేందుకు రెడీ అవుతోంది. కాగా, 2019తో పోలిస్తే ఈ ఏడాది ఏసీల విక్రయాలు 30శాతం మేర వృద్ది చెందే అవకాశం ఉన్నట్లు ఆయా ఏసీ కంపెనీలు చెబుతున్నాయి