100 కోట్ల మంది ఇండియన్స్ దగ్గర అదనపు ఖర్చుకు డబ్బు లేదు: నివేదిక
100 కోట్ల మంది భారతీయుల వద్ద ఖర్చు చేయడానికి అదనపు డబ్బు లేదని ప్రముఖ వెంచర్ కేపిటల్ కంపెనీ బ్లూమ్ వెంచర్స్ నివేదిక తెలిపింది.
By Knakam Karthik Published on 27 Feb 2025 8:05 AM IST
100 కోట్ల మంది ఇండియన్స్ దగ్గర అదనపు ఖర్చుకు డబ్బు లేదు: నివేదిక
భారతదేశంలో 100 కోట్ల మంది భారతీయుల వద్ద ఖర్చు చేయడానికి అదనపు డబ్బు లేదని ప్రముఖ వెంచర్ కేపిటల్ కంపెనీ బ్లూమ్ వెంచర్స్ నివేదిక తెలిపింది. దేశంలో దాదాపు 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. వారిలో కేవలం టాప్ 10 శాతం మంది మాత్రమే అవసరానికి మించి ఖర్చు చేయగలుగుతున్నారని నివేదిక తెలిపింది. దేశ ఆర్థిక వృద్ధిని, వినియోగాన్ని కూడా నడిపిస్తున్నది ఆ 10 శాతం మంది మాత్రమేనని నివేదిక స్పష్టం చేసింది. బ్లూమ్ వెంచర్స్ 'ఇండస్ వ్యాలీ వార్షిక నివేదిక-2025' పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్ట పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సుమారు 100 కోట్ల మంది జనాభా వద్ద తమ అవసరానికి మించి వస్తువులు లేదా సేవల కోసం ఖర్చు చేసేంత సొమ్ము లేదని నివేదిక అభిప్రాయపడింది. ప్రధానంగా దేశంలోని స్టార్టప్లు, వ్యాపారాలకు ఆదాయం అందించే వినియోగ తరగతి ప్రజలు 13-14 కోట్ల మంది మాత్రమే ఉన్నారు.
దేశంలో స్వేచ్ఛగా ఖర్చు చేయగలిగే వినియోగదారు వర్గం సైజు కేవలం 13-14 కోట్లేనని, ఇది మెక్సికో జనాభాకు సమానమని నివేదిక పేర్కొంది. మరో 30 కోట్ల మంది ఆశావహ వినియోగదారులని, ఇప్పుడిప్పుడే తమ పర్సుల్లోంచి డబ్బులు తీయడం మొదలు పెట్టారంటోంది. అయితే, వీరు ఆచితూచి ఖర్చు చేసేవారని అంటోంది. మరో 30 కోట్ల మంది ఇంకా పూర్తిగా అవసరానికి మించి ఖర్చు చేసే స్థాయిలో లేరు. వీరు యూపీఐ లాంటి డిజిటల్ చెల్లింపుల కారణంగా ఇప్పుడిప్పుడే ఖర్చు చేయడం మొదలుపెట్టారు. దేశంలోని ఈ వినియోగ తరగతి ప్రజల సంఖ్యలో పెరుగుదల గానీ, తరుగుదల గానీ లేదని నివేదిక పేర్కొంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే, భారత్లోని ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారు కానీ కొత్త ఎవరూ సంపన్నులు కావడంలేదని నివేదిక వివరించింది.
ముఖ్యంగా దేశంలో 'ప్రీమియమైజేషన్' ధోరణి వేగవంతం అవుతోంది. అంటే, బ్రాండెడ్ కంపెనీలు అధిక జనాభా కొనుగోలు చేసే మార్కెట్పై దృష్టి సారించడం కంటే సంపన్నులకు అందించే ఖరీదైన, అప్గ్రేడ్ చేసిన ఉత్పత్తులను రెట్టింపు అందుబాటులో ఉంచడంపై ఆసక్తిగా ఉన్నాయి. ఉదాహరణకు దేశంలో హై-ఎండ్ మొబైల్ఫోన్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఇదే సమయంలో బేస్-వేరియంట్ల అమ్మకాలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. మరోవైపు, దేశంలో ఆదాయ అసమానతలు కూడా బాగా పెరిగాయని నివేదిక చెబుతోంది.
దేశంవ్యాప్తంగా వినియోగం తగ్గడానికి కొనుగోలు శక్తి క్షీణించడం మాత్రమే కాకుండా, ఆర్థిక పొదుపు తగ్గడం, పెరిగిన అప్పులు కూడా కారణమని నివేదిక అభిప్రాయపడింది. ఈ కారణంగా కొవిడ్-19 మహమ్మారి తర్వాత డిమాండ్‌ను పెంచిన అన్‌సెక్యూర్డ్ లోన్లపై ఆర్బీఐ కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. కొవిడ్ తర్వాత వినియోగ తరగతి ప్రజల్లో పెరిగిన ఖర్చులు ప్రధానంగా ఇలాంటి రుణాలు తీసుకోవడం ద్వారానే జరిగాయని నివేదిక పేర్కొంది. ఆర్బీఐ చర్యలతో ఇప్పుడు వినియోగంపై ప్రభావం కనిపిస్తోందని స్పష్టం చేసింది. అయితే, ఇటీవల కేంద్ర బడ్జెట్లో రూ. 12 లక్షల వరకు పన్ను మినహాయింపు నిర్ణయం తీసుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో పంట దిగుబడి రికార్డు స్థాయిలో రావడంతో డిమాండ్ను పెంచుతుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా వినియోగం పెరిగి జీడీపీకి 0.5 శాతం మేర మద్దతిస్తుందని నివేదిక వెల్లడించింది.