ఆ కర్ణాటక ఫోటోగ్రాఫర్ ఇల్లే వెరైటీ అనుకుంటే.. ఇక కొడుకుల పేర్లైతే..!
By సుభాష్ Published on 16 July 2020 8:43 AM ISTకర్ణాటక ఫోటోగ్రాఫర్ కొత్తగా కట్టుకున్న ఇల్లు సామాజిక మాధ్యమాల్లో ఎంతగానో ఫేమస్ అయ్యింది. అందుకు కారణం అతడు కట్టుకున్న ఇల్లు అచ్చం కెమెరా లాగా ఉండడమే..! కర్ణాటక రాష్ట్రం లోని బెలగాం జిల్లాలోని శాస్త్రి నగర్ లో కెమెరా మెన్ రవి ఆయన భార్య కృప హొంగాళ్ ఇంటిని కట్టుకున్నారు. అది పెద్ద డిఎస్ఎల్ఆర్ కెమెరాను పోలి ఉంది. స్థానికంగానే కాదు వారు సోషల్ మీడియాలో కూడా సెన్సేషన్ అయ్యారు.
మూడంతస్థుల బిల్డింగ్ ను కట్టుకున్న వీరు తమ పిల్లలకు పెట్టిన పేర్లు కూడా చాలా వెరైటీ..! ప్రముఖ కెమెరా బ్రాండ్ లను పిల్లల పేర్లుగా పెట్టారు అంటే కెమెరాలు అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. ఇంతకూ వారి ముగ్గురు కొడుకుల పేర్లు ఏమిటనేగా ప్రముఖ కెమెరా బ్రాండ్ లు అయిన.. కెనాన్, ఎప్సాన్, నికాన్ లు..! నమ్మశక్యం కావడం లేదు కదా.. నిజమండీ బాబు. చుట్టుపక్కల వాళ్ళు కూడా వారిని అదే పేరుతో పిలుస్తారు. కెమెరాలో చూస్తే ఎలా కనిపిస్తుందో అచ్చం అలాగే బిల్డింగ్ కు గ్లాస్ తో వ్యూ పాయింట్ ను ఇచ్చారు. లెన్స్ చోట కూడా అద్దం ఉంచారు. పెద్ద ఫిల్మ్ స్ట్రిప్ లాంటిది కూడా ఉంచారు. ఫ్లాష్, మెమొరీ కార్డు ను కూడా ఉంచారు. ఉదయం కంటే రాత్రి పూట ఇల్లు మరింత అందంగా ఉంటుందని స్థానికులు చెప్పుకొచ్చారు. ఇక ఇంటి లోపల కూడా ఫోటోగ్రఫీకి సంబంధించిన గ్రాఫిక్స్ ను గోడల మీద ఉంచారు.
ఇంటి యజమాని రవి మాట్లాడుతూ తాను 1986 నుండి కెమెరా మెన్ గా పనిచేస్తూ ఉన్నానని.. ఈ ఇంటిని కట్టుకోవడం తనకు ఒక కల లాంటిదని చెప్పుకొచ్చాడు. తన ముగ్గురు కొడుకుల పేర్లు కెనాన్, నికాన్, ఎప్సాన్ అని తెలిపాడు. ఇవన్నీ కెమెరా పేర్లని.. తనకు కెమెరాలు ఎంతో ఇష్టం కావడంతో వారికి కెమెరా కంపెనీల పేర్లు పెట్టానని అన్నాడు. మొదట ఆ పేర్లు పెట్టడానికి తమ కుటుంబాలు ఒప్పుకోలేదని.. కానీ తాను వారికి ఆ పేర్లు పెట్టేశానని అన్నాడు రవి.
ఇల్లు కట్టడానికి కుటుంబ సభ్యులు, బంధువుల దగ్గర నుండి అప్పు తీసుకోవడమే కాకుండా.. పాత ఇంటిని అమ్మేసి కొత్త ఇంటిని కొనుక్కున్నామని చెప్పుకొచ్చాడు రవి.
రవి భార్య కృప మాట్లాడుతూ కెమెరా షేప్ లో ఇల్లు కట్టుకోవడం అన్నది తమ డ్రీమ్ అని తెలిపింది. మేము ఇంటిని ఇలా కట్టుకోవాలని అనుకున్నాము.. అనుకున్నది చేశాము.. లోపల మేమంతా వేరే ప్రపంచంలో ఉన్నట్లు ఉంటుందని.. కెమెరా లోపల ఉన్నట్లేనని.. నా భర్త పట్ల ఎంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది కృప.
పెద్ద కొడుకు కెనాన్ మాట్లాడుతూ 'నా స్నేహితులు ఇది నీ రియల్ పేరా అని చాలా సార్లు అడిగారు. నేను అవుననే చెప్పాను.. మా నాన్నకు ఫోటోగ్రఫీ అన్నది ఎంతో ఇష్టం అందుకే కెనాన్ అని పెట్టాడు అని చెప్పేవాన్ని' అని తెలిపాడు. ఈ ఇంటికి సంబంధించిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన షేర్లు అందుకుంది. ప్యాషన్ మీద ప్రేమ ఉంటే.. ఇలానే ఉంటుందని పలువురు రవి కుటుంబాన్ని అభినందించారు.