ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కొన్ని రాష్ట్రాలకు మాత్రమే చెందిన బడ్జెట్‌లా ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మోదీ ప్రభుత్వం విఫలం అయిందని.. ఈ బడ్జెటే ఊదాహరణ అని ఆమె అన్నారు. 10 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు కల్పిస్తారని ఆశించామని, ఎందుకంటే తెలంగాణలో ఉద్యోగులకు మంచి జీతాలు ఇస్తున్నామని అన్నారు. ప్రస్తుతం మంత్రి ప్రకటించిన రిబేట్ ఎవరికీ ఉపయోగపడదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు లేదా బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం లబ్ధి చేకూరేలా కేంద్రం డెవలప్మెంట్ ప్రాజెక్టులను ప్రకటించిందని కవిత ఆరోపించారు. మౌళికసదుపాయాల కల్పన కోసం పదివేల కోట్లు కేటాయిస్తున్నారని చెప్పారని, కానీ ఎటువంటి మౌళికసదుపాయాలో ఆ బడ్జెట్‌లో వెల్లడించలేదని అన్నారు. సుమారు వెయ్యి కోట్ల వరకు కేంద్రం తమకు రుణపడి ఉందని, ఆ బాకీలు చెల్లించాలని ఆర్ధికమంత్రిని కోరుతున్నట్లు కవిత తెలిపారు. మోదీ ప్రభుత్వ వైఫల్యానికి ఈ బడ్జెట్ ఒక రుజువు అని అన్నారు.