ప్రాణాలు తీసిన సెల్ఫీ మోజు.. చెరువులో పడి అన్నదమ్ములు మృతి
By తోట వంశీ కుమార్ Published on 31 May 2020 4:05 PM IST
సెల్ఫీ పిచ్చిలో పడి ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. అయినప్పటికి ఇప్పటికి కూడా యువతలో మార్పు రావడం లేదు. ఎక్కడ ఉన్నాం అనే సంగతిని మరిచి సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ప్రమాదంలో పడుతున్నారు. ప్రమాదాన్ని గుర్తించేలోపే ప్రాణాలు కోల్పోతున్నారు. అన్నాదమ్ములు ఇద్దరు సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన తాజాగా గుడివాడలో చోటు చేసుకుంది.
ఘటన వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం మందపాడు కి చెందిన కోలుసు నాగేంద్ర కి ఇద్దరు కుమారులు ఉన్నారు. హర్షవర్ధన్ బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతుండగా.. ప్రేమ్ పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. లాక్‌డౌన్ కావడంతో ప్రస్తుతం ఇద్దరు ఇంటి వద్దనే ఉంటున్నారు. కాగా.. ఈ రోజు ఉదయం చెరువు వద్దకు వెళ్లారు. వాతావరణం బాగుండడంతో సెల్ఫీ తీసుకోవాలనుకున్నారు. సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో అన్న హర్షవర్థన్ ప్రమాద వశాత్తు జారీ చెరువులో పడిపోయాడు. అన్నయ్యను రక్షించేందుకు ప్రేమ్ చెరువులో దూకాడు.
తన అన్నయ్యని రక్షించే ప్రయత్నంలో ఇరువురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చెరువులోంచి మృతదేహాలను బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ఆస్పత్రికి తరలించారు. చేతికి అందివచ్చిన కుమారులు ఇద్దరు ఒకేసారి మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వారి ఆపడం ఎవరి తరం కాలేదు. ఒకే కుటుంబంలోని అన్నదమ్ములు ఇద్దరు ఒకే సారి మృతి చెందడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
కాగా.. గతంలో కూడా అక్కడ అలాంటి ఘటనలే జరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన మున్సిపల్ అధికారులు అక్కడ రక్షణ చర్యలు చేపట్టలేదని ఆరోపించారు.