ప్రియురాలు దూరం పెడుతోందని..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 July 2020 9:10 AM IST
ప్రియురాలు దూరం పెడుతోందని..

వారి ప్రేమకు లాక్‌డౌన్‌ అడ్డువచ్చింది. లాక్‌డౌన్‌లో ప్రియురాలిని చూడలేకపోయాడు. ఎలాగైన ఆమెను చూడాలని సాహసం చేశాడు. ఏకంగా ప్రియురాలి ఇంటికి వెళ్లి అడ్డంగా బుక్కైయ్యాడు. ఆ తరువాత నుంచి ఆ యువతి అతడిని దూరం పెట్టింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించిన యువతినే అతికిరాతకంగా కడతేర్చాడు. ఈ దారుణ ఘటన కోయంబత్తూరు నగరంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరు నగరం పరిధిలోని పేరూర్‌ ఎంఆర్‌ గార్డెన్‌లో శక్తి వేల్‌ తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆయన కుమారై ఐశ్వర్య (18) పేరూర్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన రితీష్(24) ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇటీవల లాక్‌డౌన్‌ కాలంలో ఇద్దరూ కలుసుకొని మాట్లాడడం కుదరలేదు. ఎలాగైన ప్రియురాలితో మాట్లాడాలని ఓ రోజు ధైర్యం చేసి ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. ఆ యువతి కుటుంబ సభ్యులు గమనించి ఇద్దరిని గట్టిగా మందలించారు.

తల్లిదండ్రుల మాట విని ఐశ్వర్య అప్పటి నుంచి రితీష్‌ను దూరం పెట్టడం ప్రారంభించింది. అతడి ప్రేమను నిరాకరించింది. దీంతో రితీష్‌ కోపంగా రగిలిపోయాడు. యువతి ఇంటికి వెళ్లి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఐశ్వర్య మాట్లాడటానికి నిరాకరించటంతో.. తన వెంట తెచ్చుకున్న కత్తి తో విచక్షణా రహితంగా పొడిచేసాడు. అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన ఆమె తండ్రిపై కూడా దాడికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలు వారిని ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ.. ఐశ్వర్య మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story