అమరావతి: శాసనమండలి రద్దుపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొత్తుల్ని తీసుకొచ్చి ఉన్నతస్థానంలో కూర్చోబెట్టారని, అందుకే మండలి రద్దు ఆలోచన చేయాల్సి వస్తోందన్నారు. నిబంధనలు పాటించాలని చెప్పినా చైర్మన్‌ పాటించలేదని బొత్స చెప్పారు. ఇలాంటి వ్యవస్థ ఉండాలా లేదా అన్న చర్చే ఇప్పుడు నడుస్తోందన్నారు. ఉన్నత పదవుల్లో తాబేదార్లను కూర్చోబెట్టే వ్యవస్థపై చర్చ జరగాలన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తాము ముందుకెళ్తామన్నారు. శాసనమండలి రద్దుపై చట్టపరంగా ఆలోచన చేస్తామని మంత్రి బొత్స తెలిపారు.

మండలి చరిత్రలో నిన్నటి సంఘటన దుర్దినమని, డివిజన్‌ చేయకుండా బిల్లు సెలెక్ట్‌ కమిటీకి ఎలా పంపుతారని ఆయన ప్రశ్నించారు. అన్ని పక్షాలు రాజ్యాంగ బద్దంగా నడుచుకోవాలని చెప్పాయి, కొంత మంది టీడీపీ సభ్యులు కూడా ఇదే విషయం చెప్పారన్నారు. అయితే మండలి చైర్మన్‌ మాత్రం చంద్రబాబు చెప్పినట్టు నడుస్తున్నారని మంత్రి బొత్స వ్యాఖ్యనించారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటానని ప్రమాణం చేసిన చైర్మన్‌ అనైతికంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పంపిన బిల్లులను శాసనమండలిలో విపక్షం అడ్డుకోవడం బాధకరమన్నారు. మండలిలోని ప్రస్తుత పరిణామాల వల్ల కొంత జాప్యం జరిగినా.. చివరికి అమలు చేసి తీరుతామని బొత్స అన్నారు.

మండలి చైర్మన్‌ నిర్ణయం అప్రజాస్వామికమని అంబటి రాంబాబు అన్నారు. చైర్మన్‌ నిర్ణయాన్ని మేధావులంతా వ్యతిరేకిస్తున్నారన్నారు. టీడీపీకి సంఖ్యాబలం ఉన్నందునే రాజ్యాంగా స్ఫూర్తిని మరిచిపోయారని అంబటి విమర్శించారు. సంఖ్యాబలాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ సభ్యులు తీరు సరికాదని, బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపడం ఎంత వరకు సబబు అని అంబటి అన్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.