నిరుపేదలకు అమరావతిలో రూ.కోట్లు విలువ చేసే భూములు

By రాణి  Published on  23 Jan 2020 8:28 AM GMT
నిరుపేదలకు అమరావతిలో రూ.కోట్లు విలువ చేసే భూములు

ముఖ్యాంశాలు

  • అమరావతిలో భూ వివాదాలకు సంబంధించి సిబిఐ విచారణ
  • ఇన్ సైడర్ ట్రేడింగ్ పై పూర్తిగా దృష్టిపెట్టిన సిబిఐ అధికారులు
  • తెల్ల రేషన్ కార్డు ఉన్న వ్యక్తికి రూ.222 కోట్లు విలువ చేసే భూమి
  • ఇన్ కమ్ టాక్స్ కట్టని, పాన్ కార్డ్ లేని వాళ్లకు కోట్లు విలువైన భూములు
  • విచారణలో నిగ్గుతేలుతున్న నిజాలు, వాస్తవాలను వెలికితీస్తున్న అధికారులు

ఇన్ సైడర్ ట్రేడింగ్. ఏపీలో ఇప్పుడు చాలా బలంగా వినిపిస్తున్న మాట ఇది. రాజధాని నిర్మాణం పేరుతో అక్రమ రియల్ ఎస్టేట్ దందాను గత ప్రభుత్వం కొనసాగించిందనీ దానికి స్పష్టమైన ఆధారాలున్నాయనీ వై.ఎస్.ఆర్.సి.పి ప్రభుత్వం ఆరోపిస్తోంది. దానికి సంబంధించిన సాక్ష్యాలను, ఆధారాలను ప్రజల ముందు ఉంచేందుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి వెలుగుచూస్తున్న అంశాలు విస్మయం గొలిపేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అమరావతి క్యాపిటల్ రీజియన్ లో ఉన్నంత అత్యంత పేదవ్యక్తులకుకూడా కోట్లాదిరూపాయల భూములు ఉన్నట్టుగా విచారణలో తేలిన విషయాలను పోలీసులు వెల్లడించడంతో ప్రజలు విస్తుపోతున్నారు. సి.ఐ.డి విచారణ(797)లో నెలకు రూ.5,000 ఆదాయం కలిగిన నిరుపేదలు, తెల్లరేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు రూ.220 కోట్ల విలువైన భూమి ఉన్న విషయం బయటపడింది. 2014 – 2105లో వాళ్లు ఈ భూముల్ని కొనుగోలు చేసినట్టుగా దస్తావేజులు చెబుతున్నాయని పోలీసులు వివరాలు వెల్లడించడంతో కలకలం రేగింది.

మనీల్యాండరింగ్ లో భాగస్తులైన అనేకమందికి ఇప్పటివరకూ కనీసం పాన్ కార్డులుకూడా లేవని, ఒక్కపైసాకూడా వాళ్లు ఇన్ కమ్ టాక్స్ చెల్లించిన దాఖలాలు లేవని, దానిపై లోతుగా విచారణ జరిపేందుకు సహకరించాలని కోరుతూ సిబిఐ ఆదాయం పన్ను శాఖకు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరీకి లేఖలుకూడా రాసింది.

2014లో రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోయి తెలంగాణ ఏర్పడినప్పుడు అమరావతి రాజధాని కాబోతోందని, 33వేల ఎకరాల భూముల్ని రైతులనుంచి సేకరిస్తామని అప్పటికి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వై.ఎస్.ఆర్.సి.పి ప్రభుత్వం రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని భావిస్తూ మూడు రాజధానుల కాన్సెప్ట్ ని తెరమీదికి తెచ్చింది. దీని ప్రకారం అమరావతిని లెజిస్టేటివ్ రాజధానిగా ఉంచి విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మారుస్తూ ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ విశాఖకు మార్చాలని నిర్ణయించిందీ ప్రభుత్వం.

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులమని చెప్పుకునేవాళ్లు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో అమరావతి భూ కుంభకోణాలకు సంబంధించిన సిబిఐ విచారణ ఊపందుకుంది. ఈ విచారణలో విస్మయం గొలిపే అంశాలు బయటపడుతున్నాయి. దాదాపుగా గుంటూరు, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వాళ్లే దాదాపు ఏడు వందల ఎకరాలకుపైగా అమరావతి చుట్టుపక్కల భూముల్ని కొన్నారని, అవి కోట్లాది రూపాయల విలువ చేస్తాయని సిబిఐ విచారణలో తేలింది.

కోట్ల విలువైన భూముల్ని అర్థంతరంగా కొన్న గుంటూరు ప్రాంతం వాళ్లు

కోర్ క్యాపిటల్ సిటీని ప్లాన్ చేసిన తుళ్లూరు మండలంలో కోట్లాది రూపాయల లావాదేవీలు కొద్ది రోజుల వ్యవధిలోనే జరిగినట్టుగా విచారణలో వెల్లడయ్యింది. అప్పటికి అమరావతి నిర్మాణం ప్లాన్ మొదలై, తాత్కాలిక సెక్రటరియేట్, హైకోర్ట్ బిల్డింగుల నిర్మాణం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో ఒక్క తుళ్లూరు మండలంలోనే అనుమానాస్పదమైన రీతిలో జరిగిన లావాదేవీలపై విచారణ అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

కొనుగోలు చేసిన భూములు, కొనుగోలు చేసిన వ్యక్తులు, వారి ఇంటి చిరునామాలు, ఇతరత్రా ముఖ్యమైన వివరాలను సిబిఐ అధికారులు పూర్తి స్థాయిలో ఇన్ కమ్ టాక్స్ అధికారులకు అందజేశారు. ఈ ల్యాండ్ డీల్స్ కి సంబంధించి జరిగిన మనీ ల్యాండరింగ్ వ్యవహారాలను నిగ్గుతేల్చేపనిలో మరోవైపున ఈడీ బిజీగా ఉంది.

అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన నేరంకింద తెలుగుదేశంపార్టీ మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. సిఐడి పూర్తి స్థాయిలో సాక్ష్యాలు ఆధారాలను సేకరించిన తర్వాతే ఈ కేసుల్ని నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇకపై ఈ భూవివాదాలకు సంబంధించిన కేసు విచరణను పూర్తి స్థాయిలో వేగవంతం చేసేందుకు ప్రయత్నాలు గట్టిగా సాగుతాయని సిబిఐ అధికారులు చెబుతున్నారు. దాదాపుగా 797మంది తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నవారికి అమరావతి క్యాపిటల్ రీజియన్ లో భూములు ఉన్నట్టుగా విచారణలో వెల్లడయ్యింది. 529మందికి అసలు పాన్ కార్డులే లేవన్న విషయాన్ని సిబిఐ అధికారులు విచారణలో నిగ్గు తేల్చారు.

Next Story