కరోనా ఎఫెక్ట్: సరిహద్దులు మూసివేయండి
By సుభాష్ Published on 30 March 2020 9:47 AM ISTకరోనా కలకలం సృష్టిస్తోంది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఇక రాష్ట్రాల మధ్య సాగుతున్న వలస కార్మికుల కదలికతో కరోనా మరింత విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతలు తమతమ రాష్ట్రాల, జిల్లాల సరిహద్దులు మూసివేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్, హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాలు ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ రహదారుల వెండి వలస కూలీలు వెళ్లడం అడ్డుకోవాలని ఆదేశించారు.
అలాగే సరుకుల రవాణా మాత్రమే సాగాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. పేదలు, వలస కార్మికులకు వారు పని చేస్తున్న చోటు ఆహారం, ఆశ్రయం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. లాక్‌డౌన్ సమయంలో కూలీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. లాక్‌డౌన్ సమయంలో కూలీల నుంచి ఇంటి అద్దె డిమాండ్ చేయరాదని తెలియజేసింది. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా తగు చర్యలు చేపట్టాలని సూచించారు.