అల్విదా.. బై బై.. నొప్పి లేని మరో జన్మలో కలుద్దాం.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 July 2020 5:46 PM ISTఅందానికే అందం.. అద్భుతమైన స్వర గాంధర్వం.. చుట్టూ ప్రశంసించే ఆత్మీయ సమూహం.. ఒక కళకారిణి మనసారా ఆస్వాదించడానికి ఇంతకన్నా మంచి జీవితం ఎక్కడ దొరుకుతుంది. అందుకే తను కూడా ఇంకేం ఇంకేం కావాలి చాల్లే ఇది చాల్లే అనుకుంది. కొమ్మపై వాలే కోకిలమ్మలా.. ఆకాశంలో హొయలొలికే తళుకు తారలా బాలీవుడ్ లో మెరిసిపోతున్న వర్ధమాన తార దివ్యా చౌక్సే.. ఉన్నట్టుండి రాలి పోయింది. సహనటులు, అభిమానులను శోకసంద్రంలో ముంచేసి..
అనూహ్యంగా మాయదారి కేన్సర్ తన జీవితంలో రావడంతో ఏం చేయాలో దివ్యకు అర్థం కాలేదు. మొదట్లో భయంతో నీరసించి పోయినా నెమ్మదిగా తనకు తాను ధైర్యం చెప్పుకుంది. వైద్యులను సంప్రదించింది. థెరఫీ చేయించుకుంది. అందరినీ మునపటిలా నవ్వుతూ పలకరించడం ప్రారంభించింది. ఐ యామ్ ఎ సర్వైవల్ యూ నో.. అంటూ గర్వంగా చెప్పుకుంటూ తిరిగేది. కానీ చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నట్టు.. కేన్సర్ తన విధ్వంసాన్ని తాను చేసుకుపోయింది. గత ఆదివారం మృత్యువుతో పోరాడుతూ దివ్యా వెళ్లిపోయింది. వెళ్ళిపోతూ పోతూ మరో జన్మలో కలుసుకుందాం ఆనందంగా అంటూ బాధాకరమైన ట్వీట్ చేసి అభిమానులకు అల్విదా పలికేసి వెళ్లి పోయింది. ఇంతకూ ఈ బాలీవుడ్ కు ఏమైంది? మొన్న సుశాంత్.. నిన్న దివ్యా.. ఇంకా ఎందరో? ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహాలు.. అంటూ అదృశ్యమైన వారి గురించి ఆవేదన చెందడం తప్ప చేయగలిగిందేముంది?
పట్టుమని మూడుపదులు కూడా దాటని దివ్య బాలీవుడ్ లో తళుక్కున మెరిసిన యువతార. దివ్య మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లో జన్మించింది. తండ్రి మోహన్ చౌక్సే, సోదరి పల్లవి నగరంలో సుప్రసిద్ధ న్యాయవాదులు. దివ్య స్కూల్ చదువు భోపాల్ లో సాగింది. డిగ్రీ కోసం తను ఢిల్లీకి వెళ్లింది. ఆ పై చదువు యూకేలో కొనసాగించింది. బెడ్ ఫోర్డ్ షైర్ నుంచి డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణంలో మాస్టర్ డిగ్రీ చేసింది. యూకే నుంచి వచ్చాక తన దృష్టి మోడలింగ్ పైన పడింది. అదే తన కెరీర్ గా ఎంచుకుని పలు పోటీల్లో పాలుపంచుకుంది. అనంతరం సుప్రసిద్ద ఎంటీవీ మేకింగ్, ఎంటీవీ ఫీచర్ చానెల్ లలో ఫీచరింగ్ విభాగంలో పనిచేసింది. అనంతరం 2016లో సాహిల్ ఆనంద్ తో కలిసి హాయ్ అప్నా దిల్ తో ఆవారా..చిత్రం ద్వారా బాలీవుడ్ లో తెరంగేట్రం చేసింది. దివ్య సినిమాల్లో ఉంటూనే ఎన్నో బ్యూటీ కాంపిటీషన్లలో పాల్గొంది. యూకే లో నిర్వహించిన పోటీల్లో మిస్ ఇండియా రన్నరప్ గా నిలిచింది. 2012లో మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొంది.
దివ్య బహుముఖ కళాకారిణి. తను గాయనే కాదు నర్తకి కూడా! సల్సా, కథక్ నృత్యాల్లో శిక్షణ తీసుకుంది. అయితే సినిమాల్లో ఈ విద్యను ప్రదర్శించే అవకాశం రాలేదు. దివ్య గాయనిగా తన సత్తా ఏంటో 2018లో నిర్మించిన పాటియాలా ది క్వీన్ లో ప్రదర్శించింది. హనీసింగ్ తరచూ పాడే సెక్సియెస్ట్ పాటలు మహిళలు శృంగారంలో బలహీనులని స్ఫురించేలా ఉంటాయని.. వాటికి తన పాటే తిరుగులేని జవాబని వ్యాఖ్యానించింది.
తను ఎప్పుడూ సరదాగా ఉండే మనిషి. బతికినంత కాలం కళ్లల్లో నీరు ఊరకుండా చిరునవ్వులతోనే గడిపింది. ఎప్పుడూ ఉద్వేగంతో మాట్లాడేది. తను ఉన్న పరిసరాలను ప్రేమతో నింపేసేది. పద్ధతిగా ముందుగా అనుకుని మాట్లాడ్డం తనకు రాదు. ఆ క్షణంలో మనసులో ఏముంటుందో అదే మాటగా వచ్చేసేది. ఆమెను ఎవరైనా కదిపితే చాలు వారిని మాట్లాడనివ్వకుండా తనే గడగడా మాట్లాడేసేది. ప్రతి పలుకులోనూ పసితనం ఉట్టిపడేది. పైకి బోళాగా కనిపించినా వృత్తిలో మాత్రం నూటికి నూరు శాతం డెడికేటెడ్ గా ఉండేది. తన శ్రమను కష్టాన్నే తప్ప ఇతర కళాకారుల్లా లక్ ను ఎప్పుడూ నమ్ముకున్న రకం కాదు.. అంటూ సహ నటుడు ఆనంద్ సాహిల్ దివ్యను బాధగా తలచుకున్నారు.
దివ్య ఒకటిన్నర సంవత్సరం నుంచి పాంక్రియాస్ కేన్సర్ తో బాధ పడుతోంది. తనకు కేన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యాక చాలా జాగ్రత్తలు పాటించేది. కొద్ది కాలం మెడికేషన్ తర్వాత వ్యాధి తిరుగుముఖం పట్టిందని భావించింది. అయితే ఈ ఆనందం కొద్ది నెలలే! ఆ తర్వాత వ్యాధి తిరగబెట్టడంతో భరించలేని నొప్పితో అల్లాడిపోయింది. కేన్సర్ తో అలుపెరగని పోరాటం చేస్తున్నా.. అంతకంతకు నీరసించి పోయింది. చివరి క్షణాల్లో మృత్యుశయ్యపై ఉంటూ.. ఇక ఈ బాధ భరించలేను వెళ్లిపోతున్నాను అల్విదా.. నొప్పిలేని మరో జన్మలో మనమందరం కలుసుకుందాం ఆనందంగా అంటూ తన చివరి సందేశాన్ని అభిమానుల కోసం ట్వీట్ చేసిన నిరుపమాన కళాకారిణి దివ్య!
పుట్టిన ఎవరైనా గిట్టక తప్పదు అన్నది సత్యమే కావచ్చు. కానీ ఇంకా తను దిగిపోవాల్సిన మజలీ చాలా దూరం ఉందని, ఆనందంగా జీవితాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో విధి అనే టీసీ వచ్చి అమ్మాయ్ ఇక వచ్చే స్టేషన్ లో దిగిపోవాల్సిందే అంటే.. దివ్య జీవితంలో అదే జరిగింది. ముప్ఫై ఏళ్లు కూడా నిండని తనను ఈ లోకంలో ఇక ఉండటానికి వీల్లేదు అంటూ లాక్కెళ్లి పోతున్న మృత్యువును తలచుకుంటేనే వళ్ల జలదరిస్తుంది. ఎందుకో దివ్య మరణ వార్తను విన్నాక.. తేనెలొలికే పూలబాలలకు మున్నాళ్ల ఆయువిచ్చిన వాడినేమి అడిగేది? బండరాళ్ళను చిరాయువు గమ్మని ఆనతిచ్చిన వాణ్ణి ఏమి అడిగేది? అని సిరివెన్నెల రాసిన పాట గుర్తొచ్చింది. ఎంత నిజం కదా!!
- రామదుర్గం మధుసూదనరావు