సుశాంత్, ఆమె పెళ్లి చేసుకోవాలనుకున్నారు..కానీ ఇంతలోనే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jun 2020 5:27 AM GMT
సుశాంత్, ఆమె పెళ్లి చేసుకోవాలనుకున్నారు..కానీ ఇంతలోనే

మహేంద్రసింగ్ ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీ సినిమాతో అటు హిందీ, ఇటు తెలుగు ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆదివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. తొలుత అతనిది హత్యా ? లేక ఆత్మహత్యా ? అన్న అనుమానం వచ్చినప్పటికీ..పోస్టుమార్టం తర్వాత సుశాంత్ ది ఆత్మహత్యేనని నిర్థారించారు పోలీసులు. తాజాగా సుశాంత్ జీవితానికి సంబంధించిన ఓ విషయం తెరమీదికొచ్చింది. సుశాంత్, అతని ప్రియురాలు రియా చక్రవర్తి పెళ్లి చేసుకోవాలనుకున్నారన్న సంగతి రియా ప్రాపర్టీ ఏజెంట్ వెల్లడించారు.

రియా చక్రవర్తే స్వయంగా ఈ విషయాన్ని తనతో చెప్పినట్లు తెలిపారు అతను. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రియా, సుశాంత్ కలిసి ఉండేందుకు తననొక ఇల్లు చూడమన్నారని, అలాగే త్వరలోనే తామిద్దరం పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తనతో రియా చెప్పారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉంటున్న ఇంటిలో అద్దె విషయంలో లేక ఇతర విషయాల్లో ఏమైనా ఇబ్బందులున్నాయా అని ప్రశ్నించగా..అవేమీ లేవు గానీ..అప్పుడప్పుడు పార్టీలు చేసుకోవడంలో కాస్త ఇబ్బందిగా ఉన్నట్లు ఆమె చెప్పారన్నారు. ఈ విషయంపై స్థానిక సొసైటీ వారికి ఫిర్యాదులు అందినట్లు కూడా తెలిసిందన్నారు. అందుకే రియా అక్కడ ఖాళీ చేసి బాంద్రాలో మంచి ఇంటిలో సుశాంత్ తో కలిసి ఉండేందుకు తనను ఇల్లు చూసి పెట్టమన్నారని అతను పేర్కొన్నాడు.

Next Story