బీజేపీ వర్సెస్‌ వైసీపీ.. ఏపీలో రాజకీయ రగడ

By సుభాష్  Published on  21 April 2020 8:03 PM IST
బీజేపీ వర్సెస్‌ వైసీపీ.. ఏపీలో రాజకీయ రగడ

ఒక వైపు కరోనా వైరస్‌ విజృంభిస్తుంటే మరో వైపు ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా.. ఏపీలో మాత్రం రాజకీయ రగడ రగులుతూనే ఉంటుంది. పార్టీల మధ్య మాటల యుద్దాలు జరుగుతూనే ఉంటాయి. ఈ తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం అంతకంతకు పెరిగిపోతోంది.

వైఎస్సార్‌ సీపీ వర్సెస్‌ టీడీపీల మధ్య రగిలిపోయిన రాజకీయాలు.. గత రెండు రోజులుగా వైసీపీ వర్సెస్‌ బీజేపీగా మారిపోయాయి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. విశాఖలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. కన్నా లక్ష్మీనారాయణ అవినీతి వ్యవహారమంతా నాకు బాగా తెలుసని వ్యాఖ్యనించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ నాయకత్వం రాష్ట్రానికి ఎంత డబ్బు ఇచ్చింది, అందులో ఎంత దుర్వినియోగం జరిగిందనే వివరాలు నా వద్ద ఉన్నాయి.. అంటూ విజయసాయిరెడ్డి ఆరోపించారు.

పార్టీలో కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరిలు ఎంత తీసుకున్నారు..? ఏయే నియోజవర్గాలకు ఎంత పంపించారో మొత్తం వివరాలతో సహా ఆధారాలున్నాయని విజయసాయిరెడ్డి వ్యాఖ్యనించారు. అది ఆ పార్టీకి సంబంధించి అంతర్గత విషయమని, కానీ ఆ వివరాలు బయట పెట్టాలనుకోలేదని అన్నారు.

ఇక కరోనా వైరస్‌కు సంబంధించిన ర్యాపిడ్‌ కిట్ల కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు గుప్పించడంతో వివాదం రోజురోజుకూ ముదురుతోంది.

కరోనా కిట్ల కొనుగోలు వ్యవహారం.. వ్యక్తిగతంగా దూషించుకునే స్థాయికి వెళ్లిపోయింది. ఇప్పటి వరకూ కన్నా లక్ష్మీనారాయణపై విమర్శలు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి.. తాజాగా కేంద్రమాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని టార్గెట్‌ చేశారు. మంగళవారం వరుస ట్వీట్లు చేశారు.

'' బ్యాంకుల నుంచి సుజనా చౌదరి 5,700 కోట్లు లూటీ చేశారు. వడ్డీతో కలిపి ఆ మొత్తం 10వేల కోట్లకు చేరింది. బీజేపీలో కోవర్టు పనులు చేస్తూ, బాబు బానిసల పేమెంట్స్‌ చేస్తున్నారు. తిరిగే కారు, వేసుకున్న బట్టలు, తినే తిండి అంతా బ్యాంకుల్లో ప్రజలు పొదుపు చేసుకున్న డబ్బులతో కొన్నవే సుజనా'' అంటు ట్వీట్‌ చేశారు.



ఇక మరో ట్వీట్‌ ఏంటంటే..

'' రాజ్యసభ సీటుకు వంద కోట్లు, సున్నాకు పేమెంట్‌ చేసిన 20 కోట్లు, ఎన్నికల్లో అభ్యర్థులకు పంపిణీ చేసిన వెయ్యి కోట్లు, ఇన్‌సైడర్‌ ట్రేడింగులో 500 ఎకరాలు కొన్నది బ్యాంకుల డబ్బుతోనే కదా.. పేపర్లలో ఆస్తుల వేలం ప్రకటనలు వస్తున్నాబేఫికర్‌గా ఉన్నావంటే నీది మామూలు గుండె కాదు సుజనా'' అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌ చేస్తూ ఓ రేంజ్‌లో ఆరోపణలు చేశారు. ఇలా వైసీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మాటల యుద్ధాలు ఇంకా ఎటువైపు వెళ్తుంది చూడాలి.



Next Story