2021 లో రాజ్యసభలో పూర్తి మెజారిటీని దక్కించుకుని బిల్లులకు సులువుగా ఆమోదం పొందాలన్న బిజెపి ఆశలు ఇప్పట్లో నెరవేరేలా లేవు. పూర్తి మెజారిటీ ఎండమావిలా దూరం నుంచి ఊరిస్తూనే ఉంది తప్ప బిజెపికి పెద్దగా లాభమేమీ కలగడం లేదు. ఇటీవలే మహారాష్ట్రలో పూర్తి మెజారిటీ సాధించలేక చతికిల పడిపోవడం, మరో వైపు హర్యాణాలో ఎలాగోలా ప్రభుత్వం ఏర్పాటు చేసినా, తమ అభ్యర్థులందరినీ గెలిపించుకునేందుకు కావలసినంత మంది ఎమ్మెల్యేలు బిజెపి వద్ద లేరు. గతంలో 47 మంది ఎంపీలు ఉండగా ఇప్పుడు వారి సంఖ్య 40 కి పడిపోయింది. మహారాష్ట్రలో బిజెపికి గతంలో వచ్చిన సీట్ల కన్నా పదిహేడు సీట్లు తగ్గాయి. ఇక జార్కండ్ లో బిజెపి అధికారాన్నే కోల్పోయింది. జార్ఖండ్ లో బిజెపి బలం దాదాపు సగానికి పడిపోయింది.  లోకసభ ఎన్నికలకు ముందు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో బిజెపి అధికారం కోల్పోయింది. ఈ మూడింటిలో ఛత్తీస్ గఢ్ లో బిజెపి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వీటన్నిటి వల్ల పార్టీ తగినంత మంది ఎంపీలను రాజ్యసభకి గెలిపించుకునే అవకాశాలు తగ్గిపోయాయి.

ఈ ఏడాది రాజ్యసభలో 73 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. కాంగ్రెస్, సమాజవాదీ పార్టీ ఎంపీలు నలుగురు రాజీనామా చేయడంతో ఆ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటికి ఎన్నికలు జరగాల్సి వుంది. ఇవే కాక మరో 69 మంది రాజసభ సభ్యుల పదవీకాలం పూర్తి కావలసి వస్తోంది. వీరిలో బిజెపి ఎంపీలు 18 మంది కాగా కాంగ్రెస్ ఎంపీలు 17 మంది ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్న ఎంపీ స్థానాల్లో పది సీట్లు ఉత్తరప్రదేశ్ లో, మహారాష్ట్రలో ఏడు సీట్లు, తమిళనాడులో ఆరు సీట్లు, బెంగాల్, బీహార్ లలో చెరో అయిదు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్నాటక, ఒడిశాలలో చెరి నాలుగు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో చెరి మూడు, తెలంగాణ, హర్యాణా, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ లలో చెరో రెండు, ఉత్తరాఖండ్, హిమాచల్, మిజోరాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లలో చెరొకటి ఉన్నాయి. వీటిలో బిజెపి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటకల్లో, ఉత్తరాఖండ్, హిమాచల్, ఈశాన్య భారతంలో సీట్లు ప్రధానంగా గెలుచుకునే అవకాశం ఉంది. అయితే ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, బెంగాల్,తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో విపక్షాలు ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కూటమిగా బిజెపి 25 స్థానాలు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే పదవీ విరమణ చేస్తున్న వారు 18 కాగా, బిజెపికి 25 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇటీవలి ఓటములు సంభవించకుండా, బిజెపి మెజారిటీ సాధించి ఉన్నట్టయితే బిజెపి కి మరో ఏడెనిమిది సీట్లు  కలిసి వచ్చేవి. ఇప్పుడు అది సాధ్యం కాదు. మరో వైపు కాంగ్రెస్ పది నుంచి పన్నెండు ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 30 స్థానాలు కాంగ్రెసేతర, బిజెపియేతర ప్రాంతీయ పార్టీలకు వెళ్లే అవకాశం ఉంది.

245 సభ్యులున్న రాజ్యసభలో మెజారిటీ సాధించేందుకు బిజెపికి 123 స్థానాలు కావాలి. రాజ్యసభ ఎన్నికలు జరిగిన తరువాత బిజెపి, ఎన్డీయే మిత్రపక్షాల ఎంపీల సంఖ్య  108 నుంచి 110 వరకూ మాత్రమే పెరగవచ్చు. అంటే ఇంకా పన్నెండు నుంచి పదిహేను స్థానాలు తక్కువ పడవచ్చు. 12 మంది నామినేటెడ్ సభ్యుల సాయంతో, టీఆర్ ఎస్, టీడీపీ, బిజూ జనతా దళ్, అన్నా డీఎంకేల సాయంతో బిజెపి గట్టెక్కవచ్చు.  కానీ పార్టీకి సర్దుబాట్లు చేసుకోక తప్పని పరిస్థితి ఉంటుంది.  కాంగ్రెస్ స్థానాలు 60 వరకూ పెరగవచ్చునన్న అంచనాలున్నాయి.

ఈ సారి పదవీకాలం పూర్తవుతున్న ఎంపీలలో మంత్రులు హర్దీప్ సింగ్ పురి, రామ్ దాస్ అఠావళేలు ఉన్నారు. విపక్షాలనుంచి రిటైరవుతున్న ప్రముఖుల్లో దిగ్విజయ్ సింగ్, శరద్ పవార్ లు, బిజెపి సభ్యుల్లో విజయ్ గోయల్ లు ఉన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.