చలో అసెంబ్లీకి బీజేపీ పిలుపు : నేతల అరెస్ట్‌లు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Sep 2020 7:35 AM GMT
చలో అసెంబ్లీకి బీజేపీ పిలుపు : నేతల అరెస్ట్‌లు

సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన బీజేపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా బంజారాహిల్స్ నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆపై ఆయనను గోషామహాల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. బండి సంజయ్‌ను తరిలిస్తున్న పోలీసు వాహనానికి బీజేపీ కార్యకర్తలు అడ్డంగా పడుకున్నారు. అంత‌కుముందు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్‌ను అశోక్ నగర్‌లో ఆయన నివాసం వద్ద చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

బీజేపీ పిలుపు నేఫ‌థ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్‌లు చేశారు. బీజేపీ నాయకులు రామచంద్రరావు, మోత్కుపల్లి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇంటి నుంచి బయటికి వస్తే అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. శాసనమండలికి వెళ్ళాల్సిన తనను అరెస్ట్ చేస్తామనడం సరైంది కాదని రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు ఎక్కడికక్కడ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నగరంలో, జిల్లాల నుంచి వస్తున్న వారిని అక్కడే నిలిపివేస్తూ అడ్డుకుంటున్నారు. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన ఖమ్మం, నల్గొండ, భద్రాచలం కార్యకర్తలను రవీంద్ర భారతి చౌరస్తాలో పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story