నేర నేతల బ్యాడ్ టైం స్టార్ట్.. కేసులకు ప్రత్యేక ధర్మాసనం !

By సుభాష్  Published on  11 Sep 2020 7:03 AM GMT
నేర నేతల బ్యాడ్ టైం స్టార్ట్.. కేసులకు ప్రత్యేక ధర్మాసనం !

ముఖ్యాంశాలు

  • 1983 నుంచి కేసుల పెండింగ్ పై సుప్రీంకోర్టు విస్మయం

  • ప్రజా ప్రతినిధుల నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులా ? ఫాస్ట్ ట్రాక్ కోర్టులా ?

దేశంలోని కొందరు ప్రజా ప్రతినిధులపై పెండింగ్ లో ఉన్న కేసుల విచారణలో స్పీడు పెంచేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేసుల తీవ్రతను బట్టి కొన్ని సార్లు న్యాయవ్యవస్ధ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసినట్లుగానే ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని సుప్రింకోర్టు ఆలోచిస్తోంది. అందుకనే రెండు రోజుల్లోగా వివిధ రాష్ట్రాల్లో నేరచరిత్ర ఉన్న ప్రజాప్రతినిధుల కేసుల వివరాలు తనకు అందించాలంటూ సుప్రింకోర్టు ఆదేశించటం చాలా కీలకంగా మారింది. ప్రజాప్రతినిధులపై కొన్ని కేసులు 1983 నుండి పెండింగ్ లో ఉండటమే సుప్రింకోర్టును ఆశ్చర్యపరిచింది.

ఇప్పటివరకు ఢిల్లీ, కర్నాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఝార్ఖండ్, గౌహతి హై కోర్టులు మాత్రమే కేసులు ఎదుర్కొంటున్న తాజా, మాజీ ఎంపి, ఎంఎల్ఏల జాబితాలను అందిచినట్లు సుప్రింకోర్టు చెప్పింది. సుప్రింకోర్టు అభిప్రాయపడినట్లు తెలంగాణా, ఏపిలో ఇప్పటికే ఈ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులున్నా అవి సరిపోవన్న విషయంపై చర్చలు జరుగుతోంది. అలాగే చాలా రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను స్పీడుగా విచారించటానికి ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు కాలేదని సుప్రింకోర్టు వ్యాఖ్యానించటం గమనార్హం.

తెలుగురాష్ట్రాలకు చెందిన తాజా, మాజీ ఎంపిలు, ఎంఎల్ఏలపై 263 కేసులు పెండింగ్ లో ఉన్న విషయం సుప్రింకోర్టు నియమించిన అమికస్ క్యూరి ప్రస్తావించిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే సందర్భంగా ప్రజా ప్రతినిధులపై పెండింగ్ లో ఉన్న కేసులను విచారించే విషయంలో సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హ్రుషీకేస్ రాయ్ తో త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసింది. సుప్రింకోర్టు తాజా ఆదేశాల ప్రకారం క్రిమినల్ కేసులతో పాటు అవినీతి నిరోధక చట్టం, మనీల్యాండరింగ్ నిరోధక చట్టం, ఎక్సై చట్టం, కస్టమ్స్ చట్టం, జీఎస్టీ చట్టం, కంపెనీల చట్టానికి సంబంధించిన అనేక కేసులను విచారించాలని సుప్రింకోర్టు డిసైడ్ చేసింది. నిజానికి కొందరు ప్రజాప్రతినిధులు పై చట్టాల్లోని లొసుగులను ఆసరాగా తీసుకునే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

తెలుగురాష్ట్రాల్లో కేసులున్న ప్రజాప్రతినిధుల విషయం చూస్తే పై చట్టాల క్రింద కేసులు నమోదైన వారిలో విచారణ స్పీడుగా జరిగితే చాలామందికి రెండేళ్ళ శిక్షలు పడటం ఖాయమని సమాచారం. విజయవాడలోని ప్రత్యేక కోర్టులో 106 కేసులు పెండింగ్ లో ఉంటే ఇందులో 85 కేసులు సిట్టింగ్ ఎంపిలు, ఎంఎల్ఏలవే కావటం ఆశ్చర్యంగా ఉంది. సిట్టింగ్ ఎంపిలు, ఎంఎల్ఏలంటే ఎక్కువ కేసులు వైసిపికి సంబంధించిన వాళ్ళపైనే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పార్టీలేవైనా సరే రాజకీయాల నుండి నేరచరితులను ఏరేయాలన్న సుప్రింకోర్టు నిర్ణయాన్ని అందరు హర్షించాల్సిందే, తొందరగా విచారణ జరిగి శిక్షలు పడాల్సిందే.

Next Story