ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పదమవుతున్న అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోని రథం ఆగ్నికి ఆహుతైన ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఘటనపై పోలీసులు దాఖలు చేసిన కేసును సీబీఐకి బదలాయిస్తూ ప్రభుత్వం ఈ రోజు ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ రథం గత శనివారం అర్థరాత్రి అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనపై వివిధ హిందూ సంఘాలు, రాజకీయ పార్టీలు సీరియస్ కావడం, ఛలో అంతర్వేది కార్యక్రమాన్ని తలపెట్టిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తకరంగా మారాయి. దీంతో అంతర్వేదిలో 144 సెక్షన్ విధించారు. ఆలయ పరిసరప్రాంతాల్లోకి ఎవరూ రాకుండా పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు.

అంతర్వేది ఘటనపై ఏపీ హోం మంత్రి సుచరిత స్పందించారు. ప్రకాశం జిల్లాలో శుక్రవారం పర్యటించారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించామని మంత్రి తెలిపారు. రథం దగ్దం వెనుక కుట్ర కోణం ఉందని అనుమానిస్తున్నామని, కొంతమంది కావాలనే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని సుచరిత మండిపడ్డారు. ప్రతిపక్షాల విమర్శలు చూస్తుంటే.. ఆ అనుమానాలు బలపడుతున్నాయని వ్యాఖ్యానించారు. రథం దగ్దం ఘటనకు కులం, మతం రంగు పూయడం శోచనీయమన్నారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story