నాకు హోమ్ క్వారంటైన్ నోటీసులు ఇవ్వలేదు.. కీలక వ్యాఖ్యలు చేసిన విష్ణువర్థన్‌రెడ్డి
By సుభాష్ Published on 24 April 2020 1:49 PM ISTఏపీ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ గురువారం కర్నూలుకు వెళ్లి రావడంతో ఆయనను కదిరిలో హోమ్ క్వారంటైన్ చేశారు. ఈ మేరకు పోలీసులు గురువారం ఆయన ఇంటి బయట గేట్‌కు నోటీసులు అతికించారు. కరోనా వ్యాప్తి నివారణలోభాగంగా పోలీసులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజా నోటీసుల ప్రకారం 28 రోజుల పాటు ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది. ఒక వేళ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు
ఈ నేపథ్యంలో క్వారంటైన్లో ఉండాలని పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. నాకు కేంద్ర సహాయమంత్రి హోదా ఉంటుంది. దేశంలో ఎక్కడికైనా తిరిగే వెసులుబాటు ఉంటుంది. కొందరు అవగాహన లేక ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక సీఐ, ఎస్సైలు అవగాహన లేక నోటీసులు అంటించారని, 24 గంటల పాటు నాకు సెక్యూరిటీ ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాకు భద్రత కల్పిస్తాయి.
అధికార పార్టీ నేతలు మితిమీరిన జ్ఞానంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అయితే జిల్లాల్లో పర్యటిస్తున్న వైసీపీ మంత్రులను క్వారంటైన్లో పెడతారా..? అంటూ విష్ణువర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. సామాజిక సేవ చేస్తున్నవారికి సహకరించాల్సిన అవసరం ఉంది. బీజేపీ నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఒక వైపు రాష్ట్రప్రభుత్వం నాకు అనుమతి ఇస్తూ, మరో వైపు రాజకీయ కోణంలో ఇబ్బంది పెట్టడం ఇది రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత కక్ష సాధింపు చర్యలా ఉందని ఆయన వ్యాఖ్యనించారు. మొన్న బొత్స సత్యనారాయణ అనంతపురం జిల్లాలో పర్యటించారని, ఈ రోజు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పర్యటిస్తున్నారని, మరి వాళ్లకు కూడా నోటీసులు ఇచ్చి క్వారంటైన్లో పెడతారా.? అంటూ విష్ణువర్ధన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తాను కర్నూలు జిల్లాలో ఉన్న ప్రస్తుత పరిస్థితి, భారత ప్రభుత్వ క్రీడల మంత్రిత్వశాఖ ద్వారా చేయాల్సిన సేవా కార్యక్రమాలపై అధికారిక సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందని, ఈ క్రమంలో ప్రభుత్వ విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పేద ప్రజలకు సహాయం అందించేందుకు తగు జాగ్రత్తలు, సామాజిక దూరాన్ని పాటిస్తున్నానని అన్నారు.
ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తుగా సమాచారం కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు. నా కర్తవ్యాలను నిర్వహిస్తున్న నన్ను స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా ప్రభుత్వ అధికారులు నన్ను కోరడం రాజకీయ కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నానని విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు.