ఏపీలో బీజేపీ కీల‌క నేత స‌స్పెండ్‌.. ఎందుకంటే..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Aug 2020 9:06 AM GMT
ఏపీలో బీజేపీ కీల‌క నేత స‌స్పెండ్‌.. ఎందుకంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు సోము వీర్రాజు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న, పార్టీకి అప్రతిష్ట తెస్తున్న నాయకులను అసలేమాత్రం ఉపేక్షించడం లేదు. పార్టీ విధానానికి విరుద్ధంగా అమరావతి రైతుల వద్దకు వెళ్లి మద్దతు ప్రకటించిన ఓ నేతను ఇటీవలే ఆయన సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా 2019 మచిలీపట్నం బీజేపీ అభ్యర్థి గుడివాక రామాంజనేయులుపై ఆయన వేటు వేశారు. తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా మద్యం తరలిస్తూ.. గుంటూరులో ఆయన పట్టుబడ్డారు. సమాజానికి హాని కలిగించేలా మద్యం రవాణ చేస్తూ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు గుడివాక రామాంజనేయులును పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు సస్పెండ్ చేసినట్లు ట్విట్టర్లో బీజేపీ ప్రకటించింది.



ఇలాంటి పనులు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని, పార్టీ క్రమశిక్షణకు లోబడి అందరూ పని చేయాలని సోము వీర్రాజు స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం రామాంజనేయులు పోలీసులకు పట్టుబడినప్పటి నుంచి బీజేపీని ట్విట్టర్లో జనాలు ఆడుకుంటున్నారు. ఎంపీ క్యాండిడేట్ మద్యం రవాణా చేయడం ఏంటని ట్రోల్ చేస్తున్నారు. రామాంజనేయులుపై వేటు పడటం ఖాయమని అప్పుడే స్పష్టం అయిపోయింది.

కాగా ఏపీలో పేరున్న మద్యం బ్రాండులేవీ దొరక్కపోవడం, అలాగే విపరీతంగా రేట్లు పెంచి అమ్ముతుండటంతో పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా జోరుగానే సాగుతున్నట్లు తెలుస్తోంది. పేరున్న నాయకులు తెర వెనుక ఉండి ఈ వ్యాపారాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం.

Next Story