ఓడిన సీఎంను ఆ రాష్ట్రం మీద ప్రయోగించిన బీజేపీ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Aug 2020 11:04 AM ISTనాలుగు చేదు అనుభవాలు ఎదురైతే కానీ తత్త్వం బోధ పడదని ఊరికే అనరు కదా. రాజకీయాల్లో తమకు తిరుగులేదన్న ఆత్మవిశ్వాసం అప్పుడప్పుడు మేలు కంటే చేటు చేస్తుందన్న విషయం మహారాష్ట్ర ఎపిసోడ్ తో కమలనాథులకు బాగా అర్థమైంది. చిరకాల మిత్రుడి విషయంలో కరకుగా వ్యవహరించి.. మొదటికే మోసం రావటమే కాదు.. తన ఖాతా నుంచి ఒక బలమైన రాష్ట్రం చేజార్చుకున్న పరిస్థితి. మహారాష్ట్రలో శివసేన విషయంలో తాము చేసిన తప్పులు.. వేరే రాష్ట్రాల్లో రిపీట్ కాకుండా ఉండేందుకు వీలుగా బీజేపీ అధినాయకత్వం తాజాగా ఒక ప్లాన్ ను సిద్ధం చేసింది.
మరికొద్ది నెలల్లో బిహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. గతానికి కాస్త భిన్నంగా ముందుగానే కళ్లు తెరిచింది బీజేపీ అధినాయకత్వం. అక్కడి ముఖ్యమంత్రి నితీశ్ తో చక్కటి సంబంధాలు కుదుర్చుకునేందుకు వీలుగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు బాధ్యతలు అప్పజెప్పింది. బిహార్ లో నడుస్తున్న సంకీర్ణ ప్రభుత్వంతో లింకులు దెబ్బ తినకుండా ఉండటంతో పాటు.. జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా పరిశీలించేందుకు వీలుగా దేవేంద్రను ముందుగానే సిద్ధం చేశారు.
ఇకపై ఆయన.. బిహార్ లో జరిగే పార్టీ సమావేశాల్లోనూ పాల్గొనటమే కాదు.. సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామిగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవటం దేవేంద్ర బాధ్యతగా చెబుతున్నారు. మహారాష్ట్రలో ఏ తప్పులు జరిగాయో.. అలాంటివి బిహార్ లో రిపీట్ కాకూడదన్నది కమలనాథుల ఉద్దేశంగా చెప్పక తప్పదు. ఇప్పటివరకు నితీశ్ తో ఎలాంటి సమస్యలు రాకున్నా.. ఎన్నికల వేళ సీట్ల సర్దుబాటు మొదలు.. అసమ్మతికి చెక్ చెప్పటం.. మిత్రుడైన జేడీయూతో చక్కటి సంబంధాలు సాగించేలా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి బాధ్యతలు అప్పజెప్పారు.
సంకీర్ణ ప్రభుత్వాన్ని డీల్ చేసే విషయంలో దేవేంద్రకున్న అనుభవాన్ని వాడుకోవాలని మోడీ అండ్ కో భావిస్తోంది. వాస్తవానికి దేవేంద్రకు.. శివసేనకు మధ్య పెద్ద పంచాయితీలు ఏమీ లేవు. బీజేపీ పెద్దలు సూచనలకు అనుగుణంగా వ్యవహరించటమే మహారాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో మార్పుకు కారణంగా చెప్పొచ్చు. ఇక.. దేవేంద్రను బిహార్ పార్టీ వ్యవహారాలు చూడాలని చెప్పటం ద్వారా.. ఆయన్ను జాతీయ రాజకీయాల్లోకి ప్రమోట్ చేసినట్లేనని చెబుతున్నారు. ఈ నిర్ణయంతో దేవేంద్రను మహారాష్ట్ర బాధ్యతల నుంచి రిలీవ్ చేసి.. బిహార్ బాధ్యతల్ని అప్పజెప్పారని చెబుతున్నారు. మరి.. ఈ కొత్త రోల్ ను దేవేంద్ర ఎలా డీల్ చేస్తారో చూడాలి.