సంజయ్ చేతుల్లోనే బండి.. స్టీరింగ్ ఎవరి చేతుల్లో?

By సుభాష్  Published on  12 March 2020 1:57 PM GMT
సంజయ్ చేతుల్లోనే బండి.. స్టీరింగ్ ఎవరి చేతుల్లో?

ఇప్పుడు “బిజెపి బండి” సంజయ్ చేతుల్లోకి వెళ్లింది. బండి మరి వేగంగా వెళ్తుందా లేక గేరు మార్చలేక డ్రైవర్ కుంగిపోతాడా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. తెలంగాణ బిజెపికి వచ్చిన యువసారధికి ఆకర్షణ మెండుగానే ఉంది. యువతలో కావలసినంత క్రేజ్ కూడా ఉంది. కానీ ముందుకు నడిపించేంత ఆలోచన ఉందా? ఇంతింత మంది శల్యుల మధ్య సారథి గెలిచేందుకు అవకాశం ఉందా?

నిజానికి బండి సంజయ్ వంటి నాయకులు బిజెపి ఫ్యాక్టరీలో మాత్రమే తయారవుతారు. సాధారణ కుటుంబం. బక్కపలచని వ్యక్తి. ఏదో ఎలాగోలాగ ఎమ్మే చదివాడు. ఉద్యోగం చేసేంత తీరికా లేదు. ఉన్నది కరిగించేంత సంపదా లేదు. భార్య ఎస్ బీ ఐ లో ఉద్యోగం చేసి తెచ్చే దానితో కుటుంబం నడుస్తుంది. అంతకు మించి పెద్దగా వనరులూ వసతులూ లేవు. కానీ సిద్ధాంతం విషయంలో అచంచలమైన పట్టుదల ఉంది. అనంతమైన విశ్వాసం ఉంది. చేతుల్లో ఏ ఆయుధం లేకపోయినా ముందుకు పరిగెత్తే మొండి తెగువ బోలెడంత ఉంది. అందుకే వినాయక నిమజ్జనం నుంచి హనుమాన్ జయంతి దాకా ప్రతిపండుగకూ ఆయనే ముందుంటాడు. రెండు సార్లు కొద్దిపాటి వోట్లతో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయిన సంజయ్ 2019 లో ఎంపీగా ఎన్నికయ్యాడు. ఇప్పుడు యంగ్ అండ్ డైనమిక్ నాయకుడి కోసం వెతుకుతున్న బిజెపి అధినాయకత్వానికి బండి సంజయ్ కనిపించాడు.

విచిత్రం చూడండి. ఒకప్పుడు జిల్లాలోని బిజెపి నాయకులు తనను పక్కన బెట్టేస్తున్నారని అలిగి ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశాడు. ఆయన పట్టించుకోవడం లేదని రాజీనామా చేశాడు. అలా జిల్లా నాయకులు సైతం పట్టించుకోని బండి సంజయ్ ఇప్పుడు తాను ఎవరి దగ్గర ఫిర్యాదు చేశారో ఆయన నుంచే పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపడుతున్నారు. యూత్ లో సంజయ్ రాగానే బోలెడంత ఉత్సాహం వచ్చింది. ఆయన తెగువ, దిటవూ తెలిసినవాళ్లంతా సంతోషంగా ఉన్నారు. పైపెచ్చు హైదరాబాద్ నగరం నుంచే పార్టీ అధ్యక్షులను ఎంపిక చేసే అలవాటున్న బిజెపి కరీంనగర్ నాయకుడిని ఎంచుకోవడం కూడా కార్యకర్తలకు ఉత్సాహకరం. సంజయన్న బండిని పరిగెత్తిస్తాడన్న నమ్మకం చాలా మందికి ఉంది.

అయితే బిజెపిలోనూ సీనియర్లకు కొదవ లేదు. కాంగ్రెస్ లో వీ హెచ్ లా వాళ్లు అయిన దానికి కాని దానికి రచ్చ చేయకపోవచ్చు. కానీ సన్నాయి నొక్కులు నొక్కే బ్యాచికేం తక్కువ లేదు. ఇప్పటికి పార్టీలో నలుగురు మాజీ రాష్ట్ర అధ్యక్షులున్నారు. ఎవరు వచ్చినా ఎవరు వెళ్లినా అదే పదవిలో విలసిల్లే ఉపాధ్యక్ష, కార్యదర్శులున్నారు. (బోలెడంత మంది స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. స్పోక్ అంటే పుల్లలు. అంటే పుల్లలు పెట్టేవారున్నారు). సంజయ్ బిజెపిలో చేరక ముందునుంచీ కార్యాలయ కార్యదర్శులు, ఆఫీస్ ఇన్ చార్జిలు ఉన్నారు. మాజీ ఎంఎల్ ఏలు, ఎంఎల్ సీలు చాలా మంది ఉన్నారు. ఇతర పార్టీల నుంచి ఈ మధ్యే వచ్చిన వారున్నారు. అందులో మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరందరినీ సంజయ్ ఎలా కలుపుకుని వెళ్లగలరన్నదే అసలు ప్రశ్న!! రానున్న కాలానికి కానున్న నాయకుడిగా సంజయ్ తనదైన ముద్ర వేస్తాడా లేక తన గ్రూపును తయారు చేసుకుంటూ మూడేళ్లు గడిపేస్తాడా అన్నది రానున్న రోజుల్లో తేలిపోతుంది.

ఇందాకే చెప్పుకున్నట్టు “బండి” సంజయ్ చేతుల్లో ఉంది. స్టీరింగ్ కూడా ఆయన చేతుల్లోనే ఉంటుందా?

Next Story