కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో కాంగ్రెస్‌ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఆమె నివాసానికి వెళ్లిన ఎంపీ.. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. వీరి భేటీలో టీపీసీసీ నూతన అధ్యక్షుని నియామకం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తుంది. సోనియాతో భేటీ ముగిసిన అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితిని వివరించేందుకు గతంలో సోనియా అపాయింట్‌మెంట్‌ కోరటం జరిగిందని, ఈరోజుకు ఆమె అపాయింట్‌ మెంట్‌ ఇవ్వడంతో తాను వెళ్లి కలవడం జరిగిందని అన్నారు.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పాలన తీరు, కాంగ్రెస్‌ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై తాను వివరించానని, అధినేత్రికూడా పలు ప్రశ్నలు అడగడం జరిగిందని అన్నారు. పార్టీ బలోపేతం కావాలంటే త్వరగా కొత్తటీంను ఏర్పాటు చేయాలని సూచించటం జరిగిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నిన్నమొన్న పార్టీలోకి వచ్చిన వారికి కాకుండా.. కొన్నేళ్లుగా పార్టీని అంటిపెట్టుకొని ఉంటున్న వారికి టీపీసీసీ చీఫ్‌ పదవి అప్పగిస్తే పార్టీకి మేలు జరుగుతుందని సోనియాకు తెలిపానన్నారు. ఆరేళ్లు ఉత్తమ్‌ అధ్యక్షులుగా ఉన్నారని, మున్సిపల్‌ ఎన్నికల తరువాత తాను పదవినుంచి తప్పుకుంటానని ఆయనే అన్నారని కోమటిరెడ్డి తెలిపారు.

తమ భేటీలో టీపీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలి.. ఎవరున్నారు అనేదానిపై చర్చ రాలేదని కేవలం కొత్తటీంను ఏర్పాటుచేయాలనే చెప్పడం జరిగిందని వెంకటరెడ్డి తెలిపారు. రేవంత్‌రెడ్డి విషయం చర్చకు రాలేదని, ఆ అంశం నాకు సంబంధం లేదని అన్నారు. ఇదిలాఉంటే టీపీసీసీ అధ్యక్షుని నియామకంపై అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ముందే నూతన అధ్యక్షుడిని ఎంపిక చేస్తారని అందరూ భావించారు. దీంతో పలువురి పేర్లను అధిష్టానం పరిశీలించింది. చివరినిమిషంలో అనూహ్య పరిణామాలతో టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకం నిలిచిపోయింది. ప్రస్తుతం కొత్త అధ్యక్షుడి నియామకంపై అధిష్టానం దృష్టిసారించింది. ఈ పరిస్థితుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోనియాతో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.