ముఖ్యాంశాలు

  • నగరంలో అన్యుహ్య సంఖ్యలో బర్త్‌ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు
  • పాత రికార్డులను తిరగేస్తున్న బల్దియా అధికారులు
  • అత్యధిక దరఖాస్తులు ఒక వర్గానికి చెందినవే..

హైదరాబాద్‌: ‘బర్త్‌ సర్టిఫికెట్‌ కావాలి’ అంటూ సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది. ఆ కథనం వివరాలు.. నగరంలో బర్త్‌ సర్టిఫికెట్ల దరఖాస్తులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత డిసెంబర్‌ నుంచి అనూహ్య రీతిలో బర్త్‌ సర్టిఫికెట్‌ల దరఖాస్తుల సంఖ్య పెరుగుతోందని బల్దియా అధికారులు చెబుతున్నారు. అయితే దీనంతటికి కారణం.. తాము హైదరాబాద్‌లోనే పుట్టామని నిరూపించుకునే అవసరం ఇప్పుడు వచ్చినట్లుంది. సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్‌ఆర్సీ చట్టాలు రాష్ట్రంలో అమలైతే వీటి అవసరం ఉంటుందని ఓ వర్గానికి చెందిన ప్రజలు అనుకుంటున్నారు.

అయితే దరఖాస్తు చేసుకుంటున్న వారంతా ఒకే వర్గానికి చెందిన వారిగా తెలుస్తోంది. అందుకే వెల్లువలా జన్మ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. మరోవైపు నగరంలో జననాల రేటు పెరుగుతోంది. ఈ దరఖాస్తుదారుల్లో.. కాటికి కాలు చాచిన వయో వృద్ధుల నుంచి.. రోజుల వయస్సున్న పిల్లలు కూడా ఉన్నారు. ముఖ్యంగా పాతబస్తీలో బర్త్‌ సర్టిఫికెట్‌ల దరఖాస్తులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి. బల్దియాకు వివిధ డివిజన్ల నుంచి వచ్చే దరఖాస్తులు.. జారీ చేసే బర్త్‌ సర్టిఫికెట్లను ఈ పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని రికార్డ్‌లను పరిశీలిస్తే బర్త్‌ సర్టిఫికెట్ల జారీ విషయమై పూర్తి వివరాలు తెలిశాయి. గత సంవత్సం డిసెంబర్‌, ఈ జనవరి నెలలో జారీ చేసిన బర్త్‌ సర్టిఫికెట్ల సంఖ్యలో తేడా కనిపిస్తోంది. 2020 జనవరి 1న 88 మంది మగవారికి, 101 మంది మహిళలకు బర్త్‌ సర్టిఫెకెట్లు మంజూరు అయ్యాయి. ఇందులో 70 మంది ఒకే వర్గానికి చెందిన వారు ఉన్నారు.

కాగా గతేడాది ఇదే సమయంలో ఇందులో సగం సంఖ్యలోనే దరఖాస్తులు ఉన్నాయని ఆశ్చర్యానికి గురైన ఓ జీహెచ్‌ఎంసీ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. రోజువారీ దాదాపుగా సగటు కంటే 100 శాతం దరఖాస్తులు పెరిగాయని బల్దియా అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చేసుకుంటున్న వారిలో ఎక్కువ మంది నిరక్ష్యరాసులే ఉండటం గమనార్హం. పాతబస్తీలోని వివిధ సర్కిల్‌ ఆఫీసుల్లో 1936లో జన్మించిన తనకు బర్త్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని, ఇంకొకరు 1945లో పుట్టిన నాకు బర్త్‌ సర్టిఫికెట్‌ కావాలని దరఖాస్తులు పెట్టుకుంటున్నారు.

మునుపెన్నడూ చూడని విధంగా దరఖాస్తులు వస్తుడడంతో బల్దియా అధికారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 86 ఏళ్లు పైబడిన వ్యక్తికి ఇప్పుడు బర్త్‌ సర్టిఫికెట్‌తో పని ఏంటని అధికారులు అనుకుంటున్నారు. ఇప్పుడు వీరి రికార్డులను వెరిఫికేషన్‌ కోసం నిజాం హయాంలో ఉన్న రికార్డులను బల్దియా అధికారులు తిరిగేస్తున్నారు. అయితే అందులో 99 శాతం దరఖాస్తుల దారుల డేటా దొరకడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆర్డీవో, పోలీసులకు వీరి దరఖాస్తులను పంపుతున్నారు.

మ్యారేజ్‌ సర్టిఫికెట్ల దరఖాస్తులు కూడా..

దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు చదువుకున్న వారైతే.. వారి దగ్గర ఉన్న పత్రాల ఆధారంగా సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. లేదంటే.. దరఖాస్తుదారుడు సమర్పించిన ఆధారాల అనుగుణంగా సర్టిఫికెట్‌ ఇస్తారు. ఇదిలా ఉంటే.. వక్ఫ్‌ బోర్డుకు కూడా మ్యారేజ్‌ సర్టిఫికెట్లు కావాలంటూ దరఖాస్తులు పెరుగుతున్నాయి. గతంలో రోజుకు 150 వరకు దరఖాస్తులు వస్తే.. ఇప్పుడు రోజుకు కనీసం 450కిపైగా మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తులు వస్తున్నట్లు సమాచారం. వెల్లువలా వస్తున్న దరఖాస్తులను చూసి వక్ఫ్‌బోర్డు అధికారులు విస్మయానికి గురవుతున్నారు.

హైదరాబాద్, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లలో దాదాపుగా 10 వేల మందికిపైగా రోహింగ్యాలు శరణార్థులుగా వచ్చి షెల్టర్‌ పొందుతున్నారని సమాచారం. అయితే వీరంతా ఇప్పటికే అక్రమంగా ఓటర్‌, ఆధార్‌, పాన్‌, పాస్‌పోర్టులు పొందినట్లు తెలుస్తోంది. తెలంగాణలో సీఏఏ, ఎన్‌ఆర్సీ అమలు అయితే తమ బండారం బయటపడుతుందనే భయంతోనే వీరంతా సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారని అనుమానం వ్యక్తం అవుతోంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.