ఈ పరిస్థితులలో ట్రంప్ నిర్ణయం ప్రమాదకరం
By సుభాష్
వివాదస్పద వ్యాఖ్యలు, అడ్డగోలు స్టేట్‌మెంట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే అగ్ర రాజ్యాధినేత ట్రంప్ నిర్ణయాన్ని మైక్రోసాప్ట్ అధినేత బిల్‌గేట్స్ వ్యతిరేకించారు. వివరాళ్లోకెళితే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వాస్తవ సమాచారం దాచి.. చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ట్రంప్ డబ్ల్యుహెచ్ఓపై మండిపడ్డ విషయం తెలిసిందే. డబ్ల్యుహెచ్ఓ సమాచారం దాచిన కారణంగా.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20 రెట్లు పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆ సంస్థకు నిధులను ఆపివేస్తున్నట్టు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపివేయాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని మైక్రోసాప్ట్ అధినేత బిల్‌గేట్స్ తప్పుపట్టారు. ప్రపంచానికి ఇప్పుడున్న పరిస్థితులలో.. ఎప్పుడూ లేనంతగా డబ్ల్యూహెచ్ఓ అవసరం ఉందని ఆయన అన్నారు.
కరోనా కారణంగా ప్రపంచమంతా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో డబ్ల్యూహెచ్ఓకు నిధులను ఆపివేయడం ప్రమాదకరమైన నిర్ణయమని చెప్పారు. డబ్ల్యూహెచ్ఓ కృషి కారణంగానే కరోనా వైరస్ విస్తరించడం నెమ్మదించిందని.. ఆ సంస్థ కార్యకలాపాలు ఆపేస్తే... వేరే ఏ సంస్థ ఆ స్థానాన్ని భర్తీ చేయలేదని అన్నారు. బిల్‌గేట్స్ వ్యాఖ్యలపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.