వలస కూలీ.. విద్యాశాలి..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  25 Aug 2020 3:38 PM IST
వలస కూలీ.. విద్యాశాలి..!

బతకడానికి భాష కావాలి. భాష ఎలా వస్తుంది? మాట్లాడితే వస్తుంది! ఈ సూత్రాన్ని నూటికి నూరుపాళ్లు అమలు చేస్తోంది బిహార్‌‡ నుంచి కేరళకు వలస వచ్చిన రోమియా కథూర్‌. ఊరు కాని ఊరు.. భాష కాని భాష అయితేనేం బతకాలన్న ఆశ బలంగా ఉన్నప్పడు ఇవన్నీ అడ్డంకులే కావు. పొట్ట చేత పట్టుకుని బిహార్‌ నుంచి వలస వచ్చిన రోమియా కథూర్‌ కుటుంబం మొదట్లో చాలా కష్టపడింది. ఆమె భర్త ఉపాధి కోసం తిరగని ప్రాంతం లేదు. క్రమంగా ఉపాధి మార్గం తెలిసింది. రోమియా ఆమె భర్త చక్కగా జీవనం సాగిస్తున్నారు. ఇంతవరకే అయితే ఇందులో చెప్పుకోదగిన విశేషమేముంటుంది? బిహార్‌ నుంచి వచ్చిన ఆమె ప్రస్తుతం మళయాళం చక్కగా రాయగలదు.. చదవగలదు.. మాట్లాడగలదు. ఈ మధ్యనే కేరళ ప్రభుత్వం లిటరసీ మిషన్‌ నిర్వహించిన పరీక్షల్లో నూటిని నూరు మార్కులు తెచ్చుకుని టాపర్‌గా వార్తలకెక్కింది రోమియా కథూర్‌!

ఆరేళ్ల కిందట ఉపాధి వెతుక్కొంటూ కేరళ వచ్చిన రోమియా ఆమె భర్త సైఫ్‌ కొల్లామ్‌ జిల్లాలోని ఉమయనల్లూర్‌లో స్థిరపడ్డారు. సైఫ్‌ వచ్చీరాని మళయాళంలో మాట్లాడుతూ కూలీ కోసం అడ్డాలో నిలుచుండేవాడు. రోమియా ఇంటి వద్దే జ్యూస్‌ అంగడి ప్రారంభించింది. ఇద్దరూ రెక్కలు ముక్కలు చేసుకుంటే తప్ప ముగ్గురు పిల్లలున్న ఆ కుటంబానికి పూట గడిచేది కాదు. ఈ క్రమంలో రోమియాకు అనుకోకుండా మళయాళం నేర్చుకునే అవకాశం లభించింది.

ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డవారికి మళయాళం నేర్పించే బృహత్‌ కార్యక్రమానికి కేరళ ప్రభుత్వం పూనుకుంది. ఇందులో భాగంగానే ఛంగతి ప్రాజెక్ట్‌ చేపట్టింది. మళయాళం, హిందీ వచ్చిన వారితో పాఠాలు చెప్పించేవారు. కూలీలను 10 మంది ఓ బృందంగా చేసి మళయాళం నేర్పేవారు. వీరికి హమారీ మళయాళం అనే పుస్తకాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. ఈ పుస్తకంలో దైనందినం మాట్లాడుకునే పద్ధతితోపాటు పరిసరాల పరిశుభ్రత, సాంకేతికత, కార్మిక హక్కులు తదితర అంశాలపై పాఠాలను పొందు పరిచారు.

మళయాళం రాకుండానే జ్యూస్‌ కొట్టును బాగా నిర్వహిస్తున్న రోమియా...భాష వస్తే వ్యాపారం మరింత సజావుగా సాగుతుందని భావించి చాగతి ప్రాజెక్టులో చేరింది. ఏదో ఉబుసుపోని వయోజనవిద్యలా కాకుండా నిజంగా మళయాళం నేర్చుకోవాలనే పట్టుదలతో రోమియా పాఠాలను శ్రద్ధగా వినేది. ఓనమాలు రాయడం తెలుసుకున్న రోమియా చాలా తక్కువ కాలంలోనే మళయాళం చదవడం, రాయడం నేర్చుకుంది. కేరళ విద్యాశాఖ నిర్వహించే సెకండ్‌ లిటరసీ పరీక్షకు హాజరు కావాలని నిర్ణయించుకుంది.

గత జనవరి 19న నిర్వహించిన చాగతి పరీక్షకు నాలుగు నెలల బిడ్డను ఎత్తుకుని వెళ్ళింది. దాదాపు రెండువేల మంది వలస కార్మికులు హాజరైన ఈ పరీక్షలో నూటికి నూరుశాతం మార్కులు సాధించి శభాష్‌ అనిపించుకుంది. లిటరసీ మిషన్‌ డైరెక్టర్‌ పీఎస్‌ శ్రీకళ స్వయంగా ఇంటికొచ్చి ఆమెను అభినందించారు. రెట్టించిన ఉత్సాహంతో రోమియా హయ్యర్‌ సెకండరీ పరీక్ష రాయాలనుకుంది. ఇందుకు లిటరసీ మిషన్‌ సభ్యులు సంపూర్త సహకారం అందిస్తామని తెలిపారు.

చాగతి సభ్యులు అందించిన హమారీ మళయాళం పుస్తకం రోమియాకు చాలా ఉపయోగపడింది. ఆ పుస్తకాన్ని బాగా చదువుకోవడం వల్ల కేవలం పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవడమే కాదు.. బయట ఎక్కడికెళ్ళినా ఎదుటి వారు మాట్లాడేది అర్థమవుతోంది. అలాగే తను కూడా మాట్లాడగలుగుతోంది. ఈ పరీక్ష వల్ల ఉద్యోగాలు వచ్చి వాలవు. అదనంగా ప్రభుత్వం సొమ్ము ఇవ్వదు.

అయితే మళయాళం నేర్చుకున్నాను.. నాకు వచ్చు అని చెప్పడానికి మాత్రం ఈ సర్టిఫికెట్‌ కచ్చితంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జ్యూస్‌ కొట్టుకు వచ్చే కస్టమర్లను ఆప్యాయంగా పలకరించడానికి మళయాళం భాష మంచి వారధిగా ఉపయోగపడుతోంది. కస్టమర్లు ఎక్కువ సంఖ్యలో వచ్చేందుకు వీలుకుదిరింది. మరి తన బతుకు బండి బాగా సాగడానికి మళయాళం భాష ఉపయోగపడినట్టేగా!

రోమియా సాధన కేవలం కేరళ , బిహార్‌ ప్రజలకే కాదు మన తెలుగువాళ్ళకు స్ఫూర్తి దాయకం. తెలుగు మాట్టాడ్డం రాయడం అవమానంగా భావించే చాలా మంది రోమియాను చూసి నేర్చుకోవాలి. ఎక్కడో బిహార్‌లో పుట్టి బతకడానికి కేరళకు తరలి వచ్చిన రోమియా దంపతులు మళయాళం నేర్చుకుంటే ఏం లాభం అనుకోలేదు. కష్టపడి భాష సొబగుల్ని తెలుసుకోగలిగారు. మరి లె లుగువారయి ఉండి తెలుగు రాదనో, నేర్చుకోలేమనో అనే వాదనలో అర్థం ఎంతుందో తెలుసుకోవాలి.

Next Story