ఇటుకలకు ఓ కిటుకు..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  24 Aug 2020 12:32 PM GMT
ఇటుకలకు ఓ కిటుకు..!

ప్రపంచంలో ఏ పదార్థమూ వ్యర్థం కాదు. కాకపోతే ఒక రూపం నుంచి మరో రూపంలోకి మారిపోతుంటుందంతే! ఈ కిటుకు తెలుసుకున్న గుజరాతీ యువకుడు డాక్టర్‌ బినీష్‌ దేశాయ్‌ వాడేసిన పీపీఈలను ఇటుకలుగా మారుస్తున్నాడు. ఈ ఇటుకలకు బ్రిక్‌ 2.0 అని క్రేజీ పేరు పెట్టాడు. ఈ స్టార్టప్‌తో కేవలం ఇటుకలు తయారీకే కాదు.. ఈ కరోనా కాలంలో విపరీతంగా పేరుకుపోయిన మాస్క్‌లు, పీపీఈల వ్యర్థాలకు ఓ పరిష్కారం కూడా లభించింది.

బ్రిక్‌ 2.0 తయారీతో రీసైక్లింగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా అని పేరు తెచ్చుకున్న బినీష్‌ దేశాయ్‌ ఈ కరోనా వేళ వ్యర్థాల సమస్యకు పెద్ద పరిష్కార మార్గంగా నిలుస్తున్నాడు. సింగిల్‌ యూజ్‌ పీపీఈ కిట్లు, మాస్క్‌లు సేకరించి వాటిని రీ సైక్లింగ్‌ చేసి పర్యావరణానికి హాని కలగని ఇటుకల్ని తయారు చేస్తున్నాడు బినీష్‌. తన ఎకో ఎలక్ట్రానిక్‌ టెక్నాలజీస్‌ స్టార్టప్‌ కంపెనీ ద్వారా వీటిని తయారు చేస్తున్నాడు. బినీష్‌కు వ్యర్థాలతో ఏదైనా చేయాలన్న ఆలోచన ఇటుకల తయారీ నుంచే రాలేదు. అంతకు ముందు కూడా పలు వ్యర్థాలతో 150 వస్తువులు తయారు చేశాడు. తాజాగా ఇటుకుల తయారీలో కిటుకులు ఇవే అంటూ చెబుతున్నాడు.

ఈ బ్రిక్‌ 2.0 ఇటుకలు పర్యావరణ హితాలే కాదు మన్నికైనవి తేలికైనవి. కరోనా నివారణకు వాడే కిట్లు, మాస్కులు లెక్కకు మిక్కిలిగా పేరుకుపోతున్నాయి. ఈ కరోనా తగ్గేదాకా ఈ తిప్పలు తప్పవు. వాటిని వాడకా తప్పదు. అయితే వాడి చెత్తకింద పడేసిన ఈ కిట్లు మాస్క్‌ల్ని ఏం చేయాలి...తగులబెడితే వాయు కాలుష్యం...సముద్రంలో పడేస్తే మరింత ప్రమాదం....పోనీ అని అలాగే వదిలేస్తే ప్రాణానికే ప్రమాదం. అందుకే బినీష్‌ బాగా ఆలోచించి వీటితో ఇటుకల్ని తయారు చేయవచ్చని చేసి నిరూపించాడు. అందుకే బినీష్‌ను అందరూ రీసైకిల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా అని ప్రశంసిస్తున్నారు.

అయితే పీపీఈ మాస్క్‌ల సేకరణ అంత సులువేం కాదు. అసలే కరోనా త్వరితంగా వ్యాప్తి చెందే వ్యాధి. అందుకే జాగ్రత్తగా ఎకోబిన్‌లను ఏర్పాటు చేసి వాటి ద్వారా వీటిని సేకరిస్తున్నాడు. పీపీఈ కిట్లు, మాస్కులు అధికంగా వాడే ఆస్పత్రులు, పోలీస్‌స్టేషన్ల వద్ద వీటిని ఉంచాడు. ఈ ఎకోబిన్‌లు నిండగానే వాటిని తరలించి నిబంధనల ప్రకారం 72 గంటలు పక్కన పెడతారు. డీ శానిటైజేషన్‌ కోసం డిస్‌ ఇన్‌ఫెక్షన్‌ చాంబర్లలో వేస్తారు. ఆ తర్వాత వినియోగిస్తారు. ప్రత్యేకమైన ఆర్గానిక్‌ బైండర్స్‌తో ఇటుకల్ని తయారు చేస్తారు.

గతంలో బినీష్‌ పేపరు, నవిలి పడేసిన చూయింగ్‌ గమ్‌లతో పి–బ్రిక్స్‌ తయారు చేశాడు. అయితే ఈ బ్రిక్‌ 2.0 వాటి కన్నా చౌకే కాదు మన్నికైనవి కూడా అంటున్నాడు. బినీష్‌ చదువుకునే రోజుల్లోనే ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. చాలా మందిలాగా పైలా పచ్చీస్‌లా తిరగక బాధ్యతో వ్యవహరించాడు. ఆ రోజుల్లోనే రూ.1600తో ‘బి డ్రీమ్‌’ పేరిట ఓ సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ ద్వారానే పి–బ్రిక్స్‌ తయారీ మొదలెట్టాడు. గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ లోని పల్లె ప్రాంతాల్లో 11 వేల మరుగుదొడ్లు నిర్మించాడు. అయితే కారణాంతరాల వల్ల ఆ సంస్థను వదిలేసి కొత్తగా ఎకో ఎలక్ట్రానిక్‌ టెక్నాలజీస్‌ సంస్థను ప్రారంభించాడు.

ఇటుకలు తయారీనేనా మరో ఆలోచన ఏమైనా ఉందా అని బినీష్‌ను అడిగితే పోర్టబుల్‌ ఐసోలేషన్‌ వార్డుల నిర్మాణం తన లక్ష్యంగా వివరిస్తాడు. ప్రస్తుతం కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న వేళ ఇలాంటి కదిలే ఐసోలేషన్‌ వార్డుల అవసరం ఎంతైనా ఉంది. వీటిని గనక తయారుచేస్తే ఎందరికో ఉపయోగపడుతుందని బినీష్‌ ఎంతో ఆశావహ దృక్పథంతో చెబుతాడు.

అవకాశాలు రాలేదనో, చదివిన చదువులకు సరిపడా ఉద్యోగం దొరకలేదనో, అమ్మానాన్నలు మమ్మల్ని సరిగా పట్టించుకోలేదనో సవాలక్ష సాకులు చెప్పే వారికి బినీష్‌ జీవితం ఓ గొప్ప ఉదాహరణ. స్వశక్తి, సొంత ఆలోచనలకు మించినదేదీ లేదనేది వాస్తవం. బుర్రకు పనిచెప్పడం ప్రారంభిస్తే ఆలోచనలు కచ్చితంగా క్యూ కడతాయి. కానీ ఎవరో వస్తారని మనకేదో చేస్తారని ఏళ్ళతరబడి ఎదురుచూస్తే నిరాశ తప్పదు. యువత సానుకూల ఆలోచనలతో ముందుకు సాగాలి. ప్రధాని కలలు కంటున్న మేక్‌ఇన్‌ ఇండియాకు బినీష్‌ లాంటి వారు చక్కని ఉదాహరణ!!

Next Story