మహారాష్ట్ర: 33కు చేరిన మృతుల సంఖ్య

By సుభాష్  Published on  23 Sep 2020 3:26 AM GMT
మహారాష్ట్ర: 33కు చేరిన మృతుల సంఖ్య

మహారాష్ట్రలో ఓ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 33కు చేరింది. థానె జిల్లా భీవండిలో మూడంతస్తుల భవనం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు దాదాపు 20 మందికిపైగా రక్షించగా, ఘటన స్థలానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, పోలీసులు చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. 43 ఏళ్లనాటి ఈ పాత భవనం ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోయింది. ఈ భవనంలో 40 ప్లాట్లు ఉండగా, సుమారు 150 మంది నివాసం ఉంటున్నారు. సోమవారం థానె విపత్తు నిర్వహణ బృందం, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఫైర్‌ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సుమారు వంద మందికిపైగా సిబ్బంది ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు క్యానిన్‌ స్క్వాడ్‌ను వినియోగిస్తున్నారు. సోమవారం జరిగిన ఈ ఘటన రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుని ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు. థానె నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న భీవండిలో ఎక్కవగా పవర్‌ లూమ్స్‌ కార్మికులు నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

భీవండీ పట్టణంలో పటేల్‌ కాంపౌండ్‌ ప్రాంతంలో 1984లో ఈ భవనాన్ని నిర్మించారు. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. భీవండీ ఘటన ఎంతగానో కలచివేసింది. బాధితుల కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్వీట్‌ చేశారు. అలాగే ప్రధాని మోదీ కూడా ట్వీట్‌ చేశారు. తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబాలకు నా సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. బాధితులకు అన్ని విధాలుగా సాయం అందిస్తాం.. అని ట్వీట్‌ చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.



Next Story