బీసీజీ నివేదిక ఏం చెబుతుందంటే..?
By న్యూస్‌మీటర్ తెలుగు
ఏపీని ఆరు ప్రాంతాలుగా విభజించి అభివృద్ధిపై దృష్టి సారించాలని బీసీజీ సూచించిందని ప్లానింగ్ డైరెక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీజీ నివేదిక వివరాలను వెల్లడించారు. బీసీజీ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటించిందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు రూ.2లక్షల కోట్ల మేర అప్పు ఉందని.. దీని కారణంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పరిస్థితి ఇబ్బందిగా ఉందని వివరించారు. అందుకే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏడు జిల్లాలు వెనుకబడి ఉన్నాయన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం విషయంలోనూ చాలా అసమతుల్యత ఉన్నట్లు తెలిపారు.
కృష్ణా, గోదావరి ప్రాంతాలలో మాత్రమే వ్యవసాయ ఉత్పత్తి ఎక్కువగా ఉందని తెలిపారు. రాష్ట్రానికి ప్రకృతి సంపద ఉన్నా సరిగా ఉపయోగించుకోలేకపోయారని అన్నారు. విశాఖపట్నం నుండి చెన్నై వరకు రోడ్ కనెక్టివిటీ ఉందని.. అక్కడ మాత్రమే ఇంటర్నేషనల్ ఎయిర్ సర్వీసులు ఉన్నాయని తెలిపారు. విశాఖలో మాత్రమే పోర్టులు అభివృద్ధి చెందాయన్నారు.
అలాగే.. 8 జిల్లాల్లో పారిశ్రామిక వృద్ధి చాలా తక్కువగా ఉందని విజయ్‌కుమార్ వెల్లడించారు. అలాగే తలసరి ఆదాయంలో ఏపీ చాలా వెనుకబడి ఉందని తెలిపారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, కర్నూలు జిల్లాల్లో పారిశ్రామిక ఉత్పత్తి తక్కువ ఉందని వివరించారు.
విశాఖలో 15 లక్షల మందికి పైగా జనాభా ఉన్నారని తెలిపారు. అక్కడ మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని వెల్లడించారు. విజయవాడలో 10 లక్షలమంది జనాభా ఉన్నా.. మౌలిక సదుపాయాలు సరిగా లేవని తెలిపారు. ఇలా పరిస్థితులను బీసీజీ బేరీజు వేసిందని వివరించారు. మూడు ప్రాంతాల్లోనూ విశాఖ, విజయవాడ, కర్నూలును ప్రధానంగా భావించి దృష్టి సారించాలని బీసీజీ సూచించిందని పేర్కొన్నారు.
సీఎం క్యాంప్ ఆఫీసుతో పాటు ఏడు కీలక విభాగాలు విశాఖలో ఉండొచ్చని తెలిపారు. హైకోర్టు బెంచ్, అత్యవసర సమావేశాల కోసం అసెంబ్లీ విశాఖలో ఉండొచ్చని సూచించారు. కర్నూలులో హైకోర్టు, అప్పిలేట్ అథారిటీలు ఉండాలని బీసీజీ సూచించింది. అలాగే అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ ఉండాలని సూచించింది.
ఇక, పరిపాలన సౌలభ్యం కోసం కార్యనిర్వాహక విధుల్లో మొత్తం 8 విభాగాలు వుండాలని బీసీజీ సూచించింది. లెజిస్లేచర్, జుడీషియరీ మినహాయిస్తే.. మిగిలిన ఆరు విభాగాల్లో నేరుగా ప్రజలకు సంబంధం ఉన్న హోం, రెవెన్యూ లంటి శాఖలకు, మిగతా శాఖలకు ఒక చోట, మిగతావి మరో చోట పెట్టాలని సూచించారు.
ఇక.. విద్య విషయానికొస్తే.. విజయవాడకు మొదటి, విశాఖకు రెండో ప్రాధాన్యం కేటాయించారు. అలాగే టూరిజంలో విశాఖకు మొదటి, విజయవాడకు రెండో ప్రాధాన్యం ఇవ్వాలని’ సూచించిందని తెలిపారు.
అలాగే.. ఒక నగరంపై రూ.లక్షకోట్లు ఖర్చుపెడితే.. 40 ఏళ్లలో అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు. అయితే ప్రస్తుతం ఏపీ అంత ఖర్చు భరించే స్థితిలో లేదని అన్నారు. ఏపీకి ఉన్న పరిమిత వనరులు అమరావతిపై కేంద్రీకరిస్తే సాధించేది ఏమీ ఉండదని స్పష్టంగా చెబుతూనే.. అభివృద్ధి వికేంద్రీకరిస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని సూచించిందని తెలిపారు.
రాజధానిగా అమరావతికి ఖర్చుపెట్టే లక్ష కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు పెడితే.. ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుందని అన్నారు. అమరావతి నిర్మాణం కన్నా.. అభివృద్ధి వికేంద్రీకరణే మేలని బీసీజీ చెప్పింది.