ఐపీఎల్‌లో ట్విస్ట్.. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి..?
By తోట వంశీ కుమార్ Published on 30 July 2020 3:36 PM ISTకరోనా కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-13వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో నిర్వహించనున్నట్లు గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. యూఏఈ వేదికగా జరగనున్న ఈ టోర్నీ కోసం బీసీసీఐ(భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఆగస్టు 2న ఐపీఎల్ పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. ఫైనల్ మ్యాచ్‌పై ఇప్పుడు కొత్త ట్విస్టు తెరపైకి వచ్చింది. నవంబర్ 8 జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ నవంబర్ 10న నిర్వహించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీపావళి వారంలో ఫైనల్ జరుపాలని టోర్నీ బ్రాడ్ కాస్టర్ స్టార్ ఇండియా కోరడంలో బీసీసీఐ ఆ దిశగా ఆలోచిస్తున్నది. పండగ సమీపంలో పైనల్ జరిగితే వ్యూవర్ షిప్ మరింత అధికంగా రావడంతో పాటు, యాడ్స్ అధికంగా వస్తాయని బ్రాడ్‌కాస్టర్లు భావిస్తున్నారు. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడకున్నా త్వరలో జరిగే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
అయితే.. ఐపీఎల్ తరువాత టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా పర్యనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ రెండు వారాలు క్వారెంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఆటగాళ్లు ముందుగానే అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. ఐపీఎల్ ఫైనల్ రెండు రోజులు వాయిదా వేస్తే.. ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమిండియా ఆటగాళ్లు స్వదేశానికి రాకుండా యూఏఈ నుంచే వెళ్లే అవకాశం ఉంది. ఐపీఎల్ అనంతరం భారత ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లకుండా.. నేరుగా ఆసీస్ గడ్డకే రావాలని క్రికెట్ ఆస్ట్రేలియా కూడా కోరుకుంటుందని సమాచారం. ఒకవేళ ఫైనల్ నవంబరు 10న జరిగితే.. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో వీకెండ్‌లో కాకుండా వీక్ మధ్యలో ఫైనల్ నిర్వహించడం ఇదే తొలిసారి అవుతుంది.