నన్నెందుకు అలా బ్యాన్‌ చేశారో..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  30 July 2020 5:33 AM GMT
నన్నెందుకు అలా బ్యాన్‌ చేశారో..!

2000 సంవత్సరం నాటి సంఘటన. ఆ ఏడు డిసెంబర్‌లో బిసీసీఐ క్రికెటర్‌ అజారుద్దీన్‌పై జీవితకాలం నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. మాచ్‌ఫిక్సింగ్‌లో తన పాత్ర ఉందని ఈ చర్యలు తీసుకుంటున్నట్టు వివరించింది. అజారుద్దీన్‌ నివ్వెరపోయాడు. ఆ ఆరోపణలు తన క్రికెట్‌ కెరీర్‌ను ఇంతలా దెబ్బతీస్తాయని ఊహించలేదు. అనంతరం సుదీర్ఘ న్యాయపోరాటం చేశాక 2012లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బ్యాన్‌ ఎత్తివేయాల్సిందిగా తీర్పునిచ్చింది. రమారమి 12 ఏళ్ళు మాజీ కేప్టెన్‌ అజారుద్దీన్‌ మానసిక ఘర్షణ ఎంత తీవ్రంగా ఉండేదో! ఇదే విషయం ఆయనతో ప్రస్తావించినపుడు ‘అసలు నాపై నిషేధ వేటు పడటానికి కారణాలేంటో ఇప్పటికీ తెలీడం లేదు.’ అన్నారు.

బిసీసీఐ తనను క్రికెట్‌ నుంచి జీవితకాలం బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాక.. అజారుద్దీన్‌ మొదట్లో కాస్త కుంగిపోయినా.. తేరుకుని న్యాయాలయం తలుపు తట్టాడు. తనకు న్యాయం జరిగేదాకా అవిశ్రాంతంగా పోరాడాడు. ఫలితంగా 12 ఏళ్ల తర్వాత అంటే 2012లో ఉన్నత న్యాయలయం ఈ నిషేధం అన్యాయం, నిరాధారం అని తేల్చింది. అజారుద్దీన్‌ క్రికెట్‌ పాకిస్తాన్‌ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో న్యాయం లభించిందన్న సంతృప్తిని వ్యక్తం చేస్తూనే.. తన చీకటి గతాన్ని మరోసారి గుర్తుచేసుకుంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ వివరాలు..

‘ఈ ఘటనకు సంబంధించి నేను ఎవరినీ విమర్శించాలనుకోవడం లేదు. కానీ ఎందుకలా జరిగిందో మాత్రం నాకు అర్థం కావడం లేదు. ఏది ఏమైనా న్యాయస్థానంలో పోరాడాలని నిశ్చయించుకుని అలాగే ఎదురీదాను. 12 ఏళ్ల తర్వాతైనా నిర్దోషినని తేలినందుకు సంతోషించాను. ఆ తర్వాత హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. బీసీసీఐ సాధారణ సమావేశానికి వెళ్లాను.’ అంటూ గతాన్ని నెమరేసుకున్నాడు.

అజారుద్దీన్‌ క్రికెట్‌ కెరీర్‌ అద్భుతం. తను 99 టెస్టుమ్యాచులు ఆడి ఆరువేలకు పైగా పరుగులు తీశారు. అలాగే 334 వన్డేలు ఆడి 9వేల పైచిలుకు పరుగులు తీశారు. తన 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌ ప్రారంభంలోనే వరుసగా మూడు సెంచరీలు చేశారు. తను నిర్దోషినని న్యాయస్థానంలో తేలాక.. ఇండియా మొదటి పింక్‌ బాల్‌ టెస్టు సమయంలో మాజీ క్రికెటర్ల గ్రూప్‌ అజారుద్దీన్‌ను చేర్చుకుని గౌరవించింది. 99వ టెస్టే తన కెరీర్‌లో ఆఖరి టెస్టని తెలిశాక ఏమాత్రం కలత చెందలేదని, సెంచురీ పూర్తి చేయలేకపోయానన్న బాధ తనకు ఏమాత్రం లేదని అజారుద్దీన్‌ అన్నారు.

‘నేను విధిని బాగా నమ్ముతాను. మన జీవితంలో ఏది జరగాలని ఉంటుందో అదే జరుగుతుందని నా ప్రగాఢ నమ్మిక. ఎవరైనా క్రికెటర్‌ 100 టెస్టులు ఆడిన ప్రతి సందర్భంలోనూ ఇలాగే అనుకుంటానే తప్ప... వంద టెస్టులు పూర్తి చేయలేకపోయానే అని కుంగిపోను’ అని చెప్పుకొచ్చారు. క్రికెట్‌లో స్కిపర్‌గా రాణించిన నేను చాలా కాలం భారత్‌ క్రీడాకారునిగా ఆడినందుకు చాలా సంతృప్తిగా, గర్వంగా ఉంది. దాదాపు 16 ఏళ్లు క్రికెట్‌ కెరీర్‌ కొనసాగించాను. అందులో పదేళ్ళు కేప్టెన్‌ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాను. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి’ అని చెప్పారు.

స్టైలిస్‌ బ్యాట్స్‌మన్‌ గా పేరుపొందిన అజారుద్దీన్‌ తన మాటల్లో పాకిస్తాన్‌కు చెందిన మాజీ బ్యాట్స్‌మన్‌ జహీర్‌ అబ్బాస్‌ను గుర్తుచేసుకున్నారు. అబ్బాస్‌ తన ఆటలో లోపాలు సరిదిద్దారని తెలిపారు. ‘1989 సంవ‌త్స‌రం ఫామ్‌లో‌ ఉండేందుకు ప్రయత్నిస్తున్న రోజులవి.. నేను పాకిస్తాన్‌ టూర్‌కు ఎంపికవుతానని కూడా చెప్పలేని పరిస్థితి. కరాచీలో జహీర్‌ భాయ్‌ మా ప్రాక్టీస్‌ చూడటానికి వచ్చారు. ఆ సమయంలోనే ఎందుకు త్వరగా ఆట ముగిస్తున్నావు.. అని అడిగారు. నేను నా సమస్యలు చెప్పాక.. జహీర్‌ మొదట బ్యాట్‌ పట్టుకునే తీరు మార్చుకో గ్రిప్‌ వస్తుందని సలహా ఇచ్చారు. జహీర్‌ సలహా పాటించి బ్యాట్‌ గ్రిప్‌ మార్చాక నా ఆట తీరే మారిపోయింది. ఆటలో చాలా కంఫర్ట్‌ అనిపించింది. నాలో ఆత్మవిశ్వాసం మళ్ళీపుంజుకుంది. ఏ జంకులేకుండా ఆడగలిగాను. అంతేకాదు అప్పటి నుంచి నా ఆటలో కసి అందరికీ స్పష్టంగా కనిపించింది’ అంటూ ఆ మధురస్మృతులను గుర్తుచేసుకున్నారు.

‘యూనిస్‌ఖాన్‌ కూడా నాలాగే 2016లో జరిగిన ఇంగ్లండ్‌ టెస్టులో పరుగులు తీయలేక ఇబ్బంది పడ్డారు. ఎంతో బాగా బ్యాటింగ్‌ చేయగల తను ఎందుకిలా ఆడుతున్నాడో నాకు అర్థం కాలేదు. నాకు యూనిస్‌ బాగా పరిచయం కాబట్టి తనను పిలిచి క్రీజ్‌లో ఉంటూ శరీరానికి దగ్గరగా బ్యాటింగ్‌ చేయాల్సిందిగా సూచించాను. తను సానుకూలంగా నా సలహా పాటించాడు. ఫలితంగా ఓవెల్‌లో జరిగిన తుది టెస్ట్‌లో డబుల్‌ సెంచురీ సాధించాడు. నాకు జహీర్‌ అబ్బాస్‌ సూచించినట్టుగానే నేను యూనిస్‌కు సూచించాను. ఇదో గొప్ప అనుభవం’ అని అజరుద్దీన్‌ అన్నారు.

తను మంచి ఫీల్డర్‌గా, క్యాచర్‌గా రాణించానని అందుకు తను బరువు తక్కువగా ఉండటమే కారణం అన్నారు. చాలా మంది క్రికెటర్లు ఫీల్డింగ్‌ పట్ల పెద్దగా ఆసక్తి చూపరు. కానీ అద్భుత ఫీల్డర్, క్యాచర్‌గా రాణించాలంటే మొదట ఫీల్డింగ్‌ చేయడంలో మజా తీసుకోవాలి. బ్యాటింగ్,‌ బౌలింగ్‌లో తీసుకున్నట్టుగానే అని అజారుద్దీన్‌ వ్యాఖ్యానించారు.

‘ఇప్పట్లో ఇండోపాక్‌ క్రికెట్‌ ఉంటుందో లేదో తెలీదు. అయినా ఆ మ్యాచ్‌ గురించి మాట్లాడ్డం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ రెండుదేశాల ఆట మనచేతుల్లో లేదు. రెండు దేశాల ప్రభుత్వాలు పరస్పరం మాట్లాడుకుంటే తప్ప ఈ మ్యాచ్‌ సాధ్యపడదు’ అని తన మనసులో మాట చెప్పారు.

Next Story