టిమిండియా తరుపున విరాట్ కోహ్లీ ఆడడం ధోనికి ఇష్టం లేదు
By తోట వంశీ కుమార్
భారత క్రికెట్‌లో ప్రస్తుత కెప్టెన్ విరాట్‌కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిలకు ప్రత్యేక స్థానం ఉంది. దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలి, రాహుల్ ద్రావిడ్ లాంటి సీనియర్లు ఆటకు వీడ్కోలు పలికాక భారత క్రికెట్ ను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇద్దరూ కలిసి మంచి సమన్వయంతో ఎన్నో మ్యాచుల్లో టీమిండియాను గెలిపించారు. మైదానంలో వీరిద్దరూ ఒకరినొకరు మద్దతు ఇచ్చుకునేవారు. కాగా.. కెరీర్ ఆరంభంలో కోహ్లీ టీమిండియా తరఫున ఆడడం ధోనీకి ఇష్టం లేదనే విషయాన్ని మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ తాజాగా బయటపెట్టాడు.
దిలీప్ వెంగ్‌సర్కార్ తాజాగా ఓ ప్రముఖ దినపత్రికతో మాట్లాడాడు. 2008లో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లాల్సి ఉంది. నేను, సెలెక్షన్ కమిటీ అండర్ -23 ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేయాలనుకున్నాం. అప్పటికే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అండర్-19 వన్డే ప్రపంచకప్‌ను గెలిచాడు. అండర్ -23లో కూడా బాగా ఆడుతున్నాడు. టీమిండియాలోకి కోహ్లీని ఎంపిక చేయడానికి అదే సరైన సమయమని నాతో పాటు సెలెక్షన్ కమిటీ భావించింది. దీంతో.. శ్రీలంక పర్యటన కోసం టీమిండియాలోకి విరాట్ కోహ్లీని ఎంపిక చేస్తున్నాం అని అప్పటి కోచ్ గ్యారీ కిర్‌స్టెన్, కెప్టెన్ ఎంఎస్ ధోనీలకు చెప్పామన్నాడు.
అయితే.. కోహ్లీ బ్యాటింగ్ చూడలేదని, అతనికి చాన్స్ ఇవ్వడం అవసరం లేదని వారు అన్నారని తెలిపాడు. అయితే కోహ్లీ బ్యాటింగ్‌ను తాను చూశానని, కోహ్లీని జట్టులోకి ఎంపిక చేస్తున్నట్లు వారికి చెప్పానని పేర్కొన్నాడు.
మరోవైపు అప్పటి బీసీసీఐ చీఫ్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యజమాని ఎన్ శ్రీనివాసన్ కూడా కోహ్లీని ఎంపిక చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నాడు. దేశవాళీల్లో పరుగులు సాధిస్తున్న తమిళనాడు ప్లేయర్ సుబ్రమణ్యం బద్రీనాథ్‌ను టీమిండియాలోకి ఎంపిక చేయాలని సూచించినట్లు పేర్కొన్నాడు.