బాలయ్య-బోయపాటి సినిమాకు అదిరిపోయే టైటిల్ అనుకుంటున్నారటగా
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Sep 2020 1:51 AM GMTనందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా అంటే చాలు.. మాస్ అభిమానులకు పండగే..! బోయపాటి శ్రీను ది బెస్ట్ బాలయ్యతోనే తీస్తాడు అని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతూ ఉంది. అందుకు ఉదాహరణ సింహా, లెజెండ్ సినిమాలే..! ఊర మాస్ ఫైట్స్, బాలయ్యకు మాత్రమే సెట్ అయ్యే డైలాగ్స్.. ఇలా అన్నిటినీ మిక్స్ చేసి అభిమానుల ముందు ఉంచుతూ ఉంటారు. ఇక ఈ కాంబినేషన్ లో మూడో సినిమా వస్తుందంటే అంచనాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే..! ప్రస్తుతం ఈ హ్యాట్రిక్ సినిమా టైటిల్ విషయంలో తీవ్ర చర్చ జరుగుతోంది.
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా టీజర్ వదిలిన సమయంలో కూడా వర్కింగ్ టైటిల్ 'బీబీ 3' అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు టైటిల్ విషయంలో చాలా పేర్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. 'డేంజర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని గతంలో వార్తలు రాగా.. ఇప్పుడు 'టార్చ్ బేరర్' అనే పేరును బోయపాటి అనుకుంటున్నారని ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. టైటిల్ విషయంలో నిజమెంతో తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్ స్టేట్మెంట్ కోసం ఎదురుచూడాల్సిందే. టార్చ్ బేరర్ అన్న టైటిల్ బాలయ్య బాబుకు బాగా సెట్ అవుతుందని నందమూరి అభిమానులు సామాజిక మాధ్యమాల్లో తమ స్పందనను తెలియజేస్తూ ఉన్నారు. బాలయ్య సినిమా టైటిల్స్ ఎంతో పవర్ ఫుల్ గా ఉండడం ఆనవాయితీ కావడంతో చిత్ర టీమ్ కూడా టార్చ్ బేరర్ ను కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది.
లాక్ డౌన్ కు ముందు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగిన సంగతి తెలిసిందే..! బ్రేక్ తీసుకున్న టీమ్ ఇంకొన్ని రోజుల్లో షూటింగ్ ను మొదలుపెట్టాలని భావిస్తోంది. ఇప్పటికే బాలకృష్ణ కూడా షూటింగ్ కు సిద్ధంగా ఉన్నామని చిత్ర యూనిట్ కు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య రెండు క్యారెక్టర్లు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అఘోరాగా కూడా ఈ సినిమాలో చేస్తున్నానని ఇటీవలే ఇంటర్వ్యూలో బాలయ్య చెప్పుకొచ్చారు.