బ్యాంకులకు భారీగా టోపీ పెట్టిన కంపెనీల్లో.. తెలుగు కంపెనీలు ఏవంటే..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 July 2020 2:54 PM ISTఎప్పటి నుంచో వినిపించే ఆరోపణే కానీ.. తాజాగా వివరాలతో సహా బయటకు రావటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. ఏళ్లకు ఏళ్లు బ్యాంకులో అకౌంట్ ఉన్నప్పటికీ.. లక్ష రూపాయిల లోన్ కోసం ప్రాసెస్ భారీగా ఉంటుంది. సామాన్యుడికి ఉండే ఈ కష్టం.. బడా బాబులకు.. బడా కంపెనీల పేరుతో చేసే దందాల దగ్గరకువచ్చేసరికి అలాంటివేమీ ఉండదు. వేల కోట్ల రూపాయిల్ని ఉత్త పుణ్యానికే అప్పుగా ఇచ్చేయటమే కాదు.. వాటిని తిరిగి రాబట్టుకోవటంలో ఫెయిల్ అయి.. నానా యాతన పడే బ్యాంకులకు సంబంధించినకీలక సమాచారం తాజగా బయటకు వచ్చింది.
అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. అందులో దేశం మొత్తంగా పదిహేడు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఎగ్గొట్టిన మొండి బకాయిలకు సంబంధించిన రిపోర్టు తాజాగా బయటపెట్టారు. ఇందులో 2426 కంపెనీలు మొత్తంగా రూ.1,47,350 కోట్ల మొత్తాన్ని బ్యాంకులకు తిరిగి కట్టకుండా ఎగ్గొట్టినట్లుగా గుర్తించారు. బ్యాంకుల్ని జాతీయం చేసి యాభై ఒక్క ఏళ్లు గడిచిన సందర్భంగా ఈ సంఘం తాజా రిపోర్టును విడుదల చేసింది. బడా కంపెనీలు.. భారీగా ఎగ్గొట్టిన కంపెనీల విషయానికి వస్తే..
కంపెనీ | చెల్లించాల్సిన అప్పు(కోట్లల్లో) |
గీతాంజలి జెమ్స్ | రూ.4644 |
విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ | రూ.2918 |
ఆర్‌ఈఐ ఆగ్రో | రూ.2423 |
ఏబీజీ షిప్ యార్డు | రూ.1875 |
కుడోస్ కెమి | రూ.1810 |
రుచి సోయా ఇండస్ట్రీస్ | రూ.1618 |
జిల్లి ఇండియా | రూ.1447 |
నక్షత్ర బ్రాండ్స్ | రూ.1109 |
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ | రూ.586 |
ఉద్దేశ పూర్వకంగా అప్పు ఎగ్గొట్టిన కంపెనీలు ఎక్కువగా ప్రభుత్వానికి చెందిన ఎస్‌బీఐ బ్యాంకులో అప్పులు తీసుకోవటం గమనార్హం. ఆ బ్యాంకుకు 685 కంపెనీలు రూ.43,887 కోట్లు ఎగవేశాయి. తర్వాతి స్థానంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు.. బ్యాంక్ ఆఫ్ బరోడా.. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఉన్నాయి. బ్యాంకులకు రూ.500 కోట్లకు పైనే ఎగవేసిన కంపెనీలు దాదాపుగా 30కి పైనే ఉన్నాయి. రూ.200 కోట్లకు పైనే మొత్తాన్ని బ్యాంకులకు టోపీ పెట్టిన కంపెనీలు ఏకంగా 147 ఉన్నాయి. ఈ సంస్థలు బ్యాంకులకు బాకీ పడిన మొత్తమే రూ.67,609 కోట్లు కావటం గమనార్హం.
బ్యాంకులకు టోపీ పెట్టిన సంస్థలు.. వారు దెబ్బేసిన మొత్తం చూస్తే కళ్లు చెదరక మానదు. బ్యాంకుల్ని బకరాలుగా చేసిన వైనంలో మొదటి ఐదు స్థానాల్లో పేరున్న బ్యాంకులే ఉండటం గమనార్హం. మొత్తం 2,426 కంపెనీలు పదిహేడు బ్యాంకులకు ఎగ్గొట్టిన మొత్తం ఏకంగా రూ.1,47,350 కోట్లు కావటం గమనార్హం. వీటిల్లో టాప్ ఐదు బ్యాంకులు.. వాటికి రావాల్సిన మొత్తాన్ని చూస్తే..
1. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.43,887 కోట్లు
2. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.22,370 కోట్లు
3. బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.14,661 కోట్లు
4. బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.11,250 కోట్లు
5. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.9,663 కోట్లు
ప్రభుత్వ రంగ బ్యాంకులకు టోపీ పెట్టిన తెలుగు కంపెనీల విషయానికి వస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. జాబితాలో ఉన్న పేర్లలో ఒకే కంపెనీ పలు మార్లు పలు కంపెనీలకు టోపీ పెట్టటం గమనార్హం. అలాంటి వారిలో పేరు.. ప్రఖ్యాతులకు లోటు లేని కంపెనీలు కూడా ఉండటం గమనార్హం.
కంపెనీ పేరు | అప్పు మొత్తం (కోట్లల్లో) |
1. కోస్టల్ ప్రాజెక్ట్స్ | రూ.984 (ఎస్‌బీఐ) |
2. బీఎస్ లిమిటెడ్ | రూ. 701 (ఎస్‌బీఐ) |
3. ట్రాన్స్ ట్రాయ్ (ఇండియా) | రూ.1481 (కెనరా, బ్యాంక్ ఆఫ్ బరోడా.. యునైటెడ్ బ్యాంక్) |
4. ఇందు ప్రాజెక్ట్స్ | రూ.566(ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంకు) |
5. దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ | రూ.625 (కెనరా, ఆంధ్రా, కార్పొరేషన్ బ్యాంక్) |
6.లియో మెరిడియన్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ | రూ.274 (ఆంధ్రా బ్యాంకు) |
7. ఎక్సెల్ ఎనర్జీ లిమిడె్ | రూ.234 (కెనరా) |
8. ఐసీఎస్ఏ (ఇండియా) | రూ.231 (ఎస్ బీఐ) |
9. టోటెమ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ | రూ.527 (బీఓబీ. ఓబీసీ.. పీఎన్‌బీ.. ఎస్‌బీఐ.. యూబీఐ.. సిండికేట్) |