ముఖ్యాంశాలు

♦ బీజేపీ తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన ‘బండి’

♦ బండి సంజయ్‌కి ఘన స్వాగతం పలికిన నేతలు

♦ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్

ఒక సాధారణమైన వ్యక్తికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్‌ అన్నారు. కేంద్రం రాష్ట్ర అధ్యక్షునిగా ప్రకటించిన తర్వాత బండి సంజయ్‌ ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్‌కి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం బీజేపీ కార్యాలయానికి చేరుకున్న సంజయ్‌.. సభలోప్రసంగించారు. పార్టీలో ఓ సామాన్య కార్యకర్తగా పని చేసిన తనను ఇంత పెద్ద జాతీయ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం బీజేపీ గౌరవమేనని కొనియాడారు. అంతేకాదు పార్టీలోని ప్రతి సామాన్య కార్యకర్తకు ఇది గౌరవమేనని పేర్కొన్నారు. తనకు ఈ పదవిని కట్టబెట్టినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రంలో బీజేపీ జెండా రెపరెపలాడేలా చేస్తాం

నూతనంగా రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనదైన శైలిలో కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా రెపరెపలాడేలా చేస్తామని, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. ఎందరో యువకుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్యమేలుతున్నారని, కార్యకర్తలు, యువకులపై ఒక్క లాఠీ దెబ్బ పడ్డా చూస్తూ ఊరుకోనని, కేసీఆర్‌ ఖబర్దార్‌ అంటూ.. తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఎంఐఎంతో కలిసి టీఆర్‌ఎస్‌ ఒక నియంతలా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

Bandi Sanjay Speech

రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రి అవసరమా..

తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల కోసం ఇచ్చే నిధులు కేసీఆర్‌ సొత్తు కాదని, కేంద్రం ఇచ్చే నిధులను తామే ఇస్తున్నట్లు రాష్ట్రంలో ప్రచారం చేసుకోవడం మరీ దారుణమన్నారు. రాష్ట్రంలో బతుకుదెరువు కోసం యువకులు, నిరుద్యోగులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని, అన్ని రాష్ట్రాల్లో విద్య కోసం 15 శాతానికి పైగా నిధులు కేటాయిస్తుంటే .. తాజా బడ్జెట్‌లో కేవలం 7 శాతం నిధులే కేటాయించారని దుయ్యబట్టారు. విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా స్పందించని సీఎం మనకు అవసరమా.. అని అన్నారు.

కేసీఆర్‌ నీ ఆటలు సాగవు..

తెలంగాణ కోసం యువకులు ఆత్మబలిదానాలు చేస్తే వారి రక్తపు మడుగుల పునాది నుంచి కేసీఆర్‌ రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. రేపటి రోజుల్లో దమ్మున్న యువకులే నీకు గోరి కడతారని బండి సంజయ్‌ ఆక్రోశం వెళ్లగక్కారు. నీ ఫాంహౌస్‌, ప్రగతిభవన్‌ సంగతేంటో చూస్తారని, నీ కోటను బద్దలు కొడతారన్నారు.  మైనారిటీ ఓట్లతో రాజ్యమేలాలని చూస్తున్న నీ ఆటలు ఇక సాగవన్నారు. తెలంగాణ ప్రజలకు తెలంగాణ అధ్యక్షుడిగా అండగా ఉంటానని, రేపటి నుంచి నీకు యుద్ధం మొదలవుతుంది.. ఈరోజే కౌంట్‌ డౌన్‌ మొదలవుతుందన్నారు. నా కార్యకర్తలపై ఒక్క లాఠీ దెబ్బ పడినా నీ గుండెల్లో నిద్రపోతానని హెచ్చరించారు. 1500 మంది త్యాగాల ఫలితాన్ని ఎంఐఎం, కేసీఆర్‌ కుటుంబాలే అనుభవిస్తున్నారని మండిపడ్డారు.

చావే నన్ను చూసి భయపడుతుంది

మా కార్యకర్తలు లాఠీ దెబ్బలకు భయపడరు.. మమ్మల్ని అరెస్టు చేయాలంటే నువ్వు ఇంకా అదనపు జైళ్లు కట్టుకోవాలి. ఈ బండి సంజయ్‌ దేనికి భయపడడు..చావే నన్ను చూసి భయపడుతుంది. ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్దం అని అన్నారు. తెలంగాణలో బీజేపీ జెండా రెపరెపలాడిస్తామని, సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేస్తున్నాడని, కేసీఆర్‌కు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఓవైసీ, కేసీఆర్‌ కుటుంబాలు శాసిస్తున్నాయని, ఇక నుంచి కేసీఆర్‌కు బుద్ది చెబుతామని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.