Fact Check : బాబ్రీ మసీదును కూల్చడానికి వెళ్లిన బల్బీర్ సింగ్ ఇస్లాం మతాన్ని స్వీకరించి ముస్లింగా మారాడా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Aug 2020 4:53 PM IST
Fact Check : బాబ్రీ మసీదును కూల్చడానికి వెళ్లిన బల్బీర్ సింగ్ ఇస్లాం మతాన్ని స్వీకరించి ముస్లింగా మారాడా..?

ఆగష్టు 5న భారత ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భూమి పూజను నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న రామ జన్మభూమి వివాదానికి స్వస్తి పలికారు. బాబ్రీ మసీదును 1992, డిసెంబర్ 6న కూల్చి వేసిన ఘటన రామ మందిరం-బాబ్రీ మసీదు చరిత్రలో చెరిగిపోని ఘటన. గత కొద్దిరోజులుగా అప్పటి ఘటనకు సంబంధించిన పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.

అలాంటి ఓ పోస్టింగ్ లో 'బల్బీర్ సింగ్' అనే వ్యక్తికి సంబంధించిన విషయం కూడా వైరల్ అవుతోంది. బాబ్రీ మసీదును కూల్చి వేయడానికి వెళ్లిన వారిలో బల్బీర్ సింగ్ కూడా ఒకరు. ఈ ఘటన జరిగిన తర్వాత బల్బీర్ సింగ్ ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. ఇప్పటి దాకా 90కి పైగా మసీదులను కట్టించాడు. 100 మసీదులను కట్టించాలన్నది బల్బీర్ సింగ్ లక్ష్యం. త్వరలోనే అతడి లక్ష్యం నెరవేరాలన్నది ఆకాంక్ష అంటూ ఓ ఫేస్ బుక్ పోస్టు వైరల్ అవుతోంది.

"బాబ్రీ మసీదు పై మొట్ట మొదటి వేటు వేసిన కరసేవకుడు బల్బీర్ సింగ్ అల్లాహ్ కారుణ్యంతో ఇస్లాం స్వీకరించాడు ....!!

100 మసీదులు కట్టాలనే దృడ సంకల్పంతో కష్టపడుతూ ఇప్పుడు 90 మసీదులు వరకు నిర్మించాడు . త్వరలోనే అతని కల నెరవేరాలని కోరుకుందాం." అన్నది ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్ట్.

ట్విట్టర్ లో కూడా అతడి మీద పలువురు పోస్టులు పెట్టారు.

నిజ నిర్ధారణ:

బాబ్రీ మసీదును కూల్చిన వారిలో కరసేవకుడైన బల్బీర్ సింగ్ కూడా ఒకరు. ఆయన ఇస్లాం మతం స్వీకరించారన్నది 'నిజం'.

ఇస్లాం మతాన్ని స్వీకరించిన బల్బీర్ సింగ్ పాతబడ్డ మసీదులను రిపేర్ చేయడానికి, కొత్తవాటిని కట్టించడానికి పూనుకున్నారు. ఆయన అనుకున్న 100 మసీదుల నిర్మాణాన్ని కూడా పూర్తీ చేసినట్లు తెలుస్తోంది. 2017, 2018 సమయంలో అతడి మీద వచ్చిన పలు వార్తా కథనాలు న్యూస్ మీటర్ కు లభించాయి.

2017, Mumbai Mirror లో వచ్చిన కథనం ప్రకారం బాబ్రీ మసీదును కూల్చడానికి వెళ్లిన కరసేవకుల్లో బల్బీర్ సింగ్ కూడా ఒకరు. ప్రస్తుతం మొహమ్మద్ ఆమిర్ లక్ష్యం 100 మసీదులను రిపేరీలు చేయడం లేదా కట్టించడమే.. ఇంతకూ మొహమ్మద్ ఆమిర్ ఎవరో కాదు బల్బీర్ సింగ్ యే..! బాబ్రీ మసీదు పైకి ఎక్కి గుమ్మటాన్ని కూల్చి వేయడానికి ప్రయత్నించిన కరసేవకుడైన బల్బీర్ సింగ్ ఆ తర్వాత ముస్లింగా మారాడు.. మొహమ్మద్ ఆమిర్ అనే పేరును పెట్టుకున్నాడు.

2018లో ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొహమ్మద్ ఆమిర్ పలు విషయాలను చెప్పుకొచ్చాడు. తాను రాజ్ పుత్ ఫ్యామిలీలో పుట్టానని తెలిపాడు. నేను చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చాలా పెద్ద తప్పు చేశానని అన్నాడు మొహమ్మద్ ఆమిర్. ఆ పశ్చాత్తాపంతోనే ఇస్లాం మతాన్ని స్వీకరించినట్లు తెలిపాడు.

యూట్యూబ్ లో కూడా బల్బీర్ సింగ్ మొహమ్మద్ ఆమిర్ లా ఎలా మారాడు అన్న విషయమై వీడియోను అప్లోడ్ చేశారు. UP Tak News యూట్యూబ్ ఛానల్ లో 30 అక్టోబర్ 2019న ఇంటర్వ్యూను అప్లోడ్ చేశారు.

బాబ్రీ మసీదును కూల్చడానికి వెళ్లిన కరసేవకుడైన బల్బీర్ సింగ్ ఇస్లాం మతం స్వీకరించి మొహమ్మద్ ఆమిర్ గా మారాడన్నది 'నిజం'.

Next Story