బాలయ్య ఇంకో ‘భైరవద్వీపం’ చేయబోతున్నాడా?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Jun 2020 2:37 PM ISTనందమూరి బాలకృష్ణ సినిమాల ఎంపిక భలే చిత్రంగా ఉంటుంది. ఆయన ఎప్పుడు ఎవరితో సినిమా చేస్తాడో.. ఎలాంటి కథను ఎంచుకుంటాడో అంతుబట్టని విధంగా ఉంటుంది. క్రిష్ జాగర్లమూడి లాంటి క్లాస్ డైరెక్టర్‌తో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. అలాగే పూరి జగన్నాథ్‌తో ‘పైసా వసూల్’ చేయడమూ పెద్ద షాకే. ఔట్ డేట్ అయిపోయాడనుకున్న కె.ఎస్.రవికుమార్‌తో వరుసగా ‘జై సింహా’, ‘రూలర్’ సినిమాలు చేసి ఆశ్చర్యపరిచాడు. త్వరలోనే బాలయ్య ఇంకేదో షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చిన బాలయ్య.. అందులో కొత్త ప్రాజెక్టుల గురించి నర్మగర్భంగా మాట్లాడాడు. గతంలో ‘భైరవద్వీపం’ లాంటి జానపద చిత్రం చేశారు, మళ్లీ అలాంటిది చేయలేదేంటి అని అడిగితే.. తప్పకుండా ఆ టైపు సినిమా చేస్తా, నాలుగు రోజులు ఆగండి, మీకే తెలుస్తుంది అని బాలయ్య షాకిచ్చాడు. మరి బాలయ్య నుంచి ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాబోతోందన్నది ఆసక్తికరం.
ఇక బోయపాటితో చేస్తున్న సినిమా గురించి బాలయ్యను అడిగితే.. లాక్‌డౌన్‌కు ముందు కేవలం ఐదు రోజులు మాత్రమే ఈ సినిమా చిత్రీకరణ జరిగిందని.. బోయపాటితో సినిమా అంటే ముందు ఫైట్‌తో షూటింగ్ మొదలుపెట్టడం తమకు సెంటిమెంటు అని, ఈసారి కూడా అదే చేశామని అన్నాడు బాలయ్య. ఈ సినిమా చేస్తుండగా వేరే సినిమా మొదలుపెట్టే ఉద్దేశం లేదని.. అందుకు గెటప్ ఓ కారణమని.. బోయపాటి గెటప్‌ల నుంచే క్యారెక్టర్లు, కథ సృష్టిస్తాడని.. ఇప్పుడు చేస్తున్న కొత్త సినిమా విషయంలోనూ అదే జరుగుతోందని అన్నాడు బాలయ్య.
మలయాళ మల్టీస్టారర్ మూవీ ‘అయ్యప్పనుం కోషీయుం’లో బాలయ్య నటిస్తాడన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మల్టీస్టారర్ల గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే బాలయ్య సమాధానం దాటవేశాడు. తాను వేరే హీరోలతో కలిసి నటించడం కోసం గతంలో కొన్ని ప్రపోజల్స్ పెట్టానని.. అవతలి నుంచి సమాధానం రాకపోవడంతో వారితో సంబంధాలు తెంచుకున్నానని బాలయ్య ఈ సందర్భంగా చెప్పాడు.