బాలయ్య ఇంటర్వ్యూ లక్ష్యం నెరవేరిందా అసలు.?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Jun 2020 8:29 AM ISTనందమూరి బాలకృష్ణ తన సినిమా రిలీజ్‌కు రెడీ అయినపుడు తప్పితే మీడియాను కలవడు. ఆ సమయాల్లో కూడా టీవీ ఛానెళ్లకు స్పెషల్ ఇంటర్వ్యూలు ఇవ్వడమే గగనం. అలాంటిది ఏ సందర్భం లేకుండా ఇప్పుడు ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. గంట సమయం ఈ ఇంటర్వ్యూ సాగడం విశేషం. బాలయ్య ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భాన్ని బట్టి చూస్తే.. ఈ ప్రపోజల్ ఆయన పీఆర్ టీం నుంచి వెళ్లిందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో సినీ పరిశ్రమ ప్రతినిధులు నిర్వహించిన సమావేశాలకు తనను పిలవకపోవడంపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేయడం, భూములు పంచుకోవడానికి మీటింగ్ పెట్టుకున్నారని కామెంట్ చేయడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సమావేశానికి బాలయ్యను పిలవకపోవడం తప్పే అని చాలామంది అభిప్రాయపడ్డా.. భూములు పంచుకోవడానికి అనే కామెంట్ పట్ల మాత్రం అన్ని వైపులా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో డ్యామేజ్ కంట్రోల్ కోసమే బాలయ్య వర్గం ఈ ఇంటర్వ్యూ ప్లాన్ చేసినట్లుగా అనిపిస్తోంది.
తన చుట్టూ ముసురుకున్న వివాదాలతో పాటు అనేక విషయాలపై బాలయ్య ఈ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. కానీ ఇంత వివాదానికి కారణమైన కామెంట్ విషయంలో మాత్రం బాలయ్య ఏమీ మాట్లాడలేదు. భూములు పంచుకోవడానికి మీటింగ్ పెట్టుకున్నారన్న కామెంట్ మీద ఏమంటారు అంటే.. బాలయ్య కిక్కురుమనలేదు. దీనిపై ఏం మాట్లాడతా అన్నట్లుగా చిత్రమైన హావభావాలు ఇచ్చాడు. ఆ సంగతలా వదిలేస్తే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణానికి విరాళాల సేకరణ కోసం నిర్వహించిన అమెరికా టూర్ ప్రోగ్రాం సందర్భంగా జరిగిన రగడ గురించి ప్రస్తావించి ప్రత్యర్థి వర్గాన్ని ఆత్మరక్షణలోకి నెట్టాలని చూశాడు బాలయ్య. మిగతా ఇంటర్వ్యూ అంతా తన గురించి, తన తండ్రి గురించి మాట్లాడటానికి సరిపోయింది. మొత్తంగా చూస్తే మాత్రం ఆత్మస్తుతి పరనింద అన్నట్లుగా సాగిన ఈ ఇంటర్వ్యూతో బాలయ్య ఏం సాధించాడన్నదే అర్థం కాని విషయం.