బాలాకోట్‌ సర్జికల్‌ స్ట్రైక్‌

By సుభాష్  Published on  26 Feb 2020 3:19 PM IST
బాలాకోట్‌ సర్జికల్‌ స్ట్రైక్‌

- బాలాకోట్‌ సర్జికల్‌ స్ట్రైక్‌కు ఏడాది

బాలాకోట్‌.. ఈ పేరు మ‌న‌దేశంలో కొన్ని నెల‌ల పాటు మారుమోగిపోయింది. జ‌మ్మూక‌శ్మీర్ స‌రిహ‌ద్దుకు ఆనుకుని ఉండే ఈ బాలాకోట్ గురించి చాలా రోజులుగా చ‌ర్చించుకున్నారు. రాజ‌కీయంగా కొన్ని కీల‌క ప‌రిణామాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచింది. పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జైషే మహ‌మ్మ‌ద్‌ ఉగ్ర‌వాదులు దాడికి ప్ర‌తీకారంగా భార‌త వైమానిక ద‌ళం చేప‌ట్టిన రెండో సర్జిక‌ల్ స్ట్రైక్స్‌కు ఫిబ్రవరి 26వ తేదీ నాటికి ఏడాది పూర్త‌యింది.

ఈ నేప‌థ్యంలో మ‌రోసారి బాలాకోట్‌పై అంద‌రికి దృష్టి నిలిచింది. పుల్వామా జిల్లా అవంతిపురా స‌మీపంలో గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన జైషే మ‌హమ్మ‌ద్ ఉగ్ర‌వాదులు సృష్టించిన మార‌ణ‌హోమం ఇంకా మ‌ర్చిపోలేక‌పోతున్నారు. సెల‌వులు ముగించుకుని విధుల‌కు హాజ‌ర‌య్యేందుకు బ‌య‌లుదేరిన సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్ర‌వాది ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చాలా మంది జవాన్లు ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేకపోతున్నారు.

ఉగ్ర శిబిరాలపై బాంబుల వర్షం

ఇక పుల్వామా ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత సైన్యం 12 రోజుల తర్వాత పాకిస్తాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. జమ్మూ సరిహద్దులను దాటి తన ప్రతాపం చూపించింది భారత సైన్యం. పాక్‌లోని బాలాకోట్‌ పరిసరాల్లోని ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకున్న భారత వైమానిక దళం.. బాంబుల వర్షాన్ని కురిపించింది. ఈ శిబిరాలన్ని జైషే మహమ్మద్‌కు చెందినవే. కాగా, బాలాకోట్‌ పరిసరాల్లోని పర్వత శ్రేణులను బేస్‌ క్యాంపులు చేసుకుని ఉగ్రవాదులను తయారు చేసే శిక్షణా కేంద్రాలు ఇవి. ఈ దాడిలో 400లకు పైగా ఉగ్రవాదులు హతమైనట్లు భారత సైన్యం పేర్కొంది. బాలాకోట్‌లోని జైషే ఉగ్రవాద శిబిరాలను టార్గెట్‌ చేసినట్లు భారత ప్రభుత్వం తరపున విదేశాంగ కార్యదర్శి విజయ్‌ గోఖలే అధికారికంగా ప్రకటించారు.

మిరజ్‌ 2000 ఎయిర్‌ క్రాఫ్‌లతో బాలాకోట్‌ దాడుల కోసం భారత వైమానిక దళం మిరజ్‌ 2000 ఎయిర్‌ క్రాఫ్‌లను వినియోగించింది. ఇజ్రాయెల్‌లో తయారైన స్పైస్‌ బాంబులను ప్రయోగించింది. ఈ దాడులతో ఉగ్ర శిబిరాలన్నీ నేలమట్టం అయ్యాయి. దీనికి సంబంధించి వైమానిక దళాధికారులు విడుదల చేసిన ఉపగ్రహ ఫోటోలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. 128 చదరపు మీటర్ల పరిధిలో విధ్వంసం సృష్టించినట్లు నిర్ధారించాయి.

పాక్‌ సర్కార్‌కు భంగపాటు

ఇక అంతర్జాతీయ వేదికలపై పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్‌ వైమానిక ఘటనల అనంతరం రెండు దేశాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌ చేసిన ఆరోపణలు వృధా అయ్యాయి. పాక్‌ సర్కార్‌కు భంగపాటు ఎదురైంది. ఇక జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను పాక్‌ నుంచి కొనసాగుతున్నాయంటూ భారత సైతం ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించింది. ఉగ్రవాదులకు అండగా నిలుస్తోందని ఆరోపించింది.

ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత

ఈ విషయంపై పాకిస్తాన్‌కు ప్రపంచ దేశాల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురైంది. జైషే, లష్కరే తొయిబా వంటి ఉగ్రసంస్థల అధినేతలను అరెస్ట్‌ చేయాలంటూ పాకిస్తాన్‌పై ప్రపంచ దేశాలు సైతం తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చాయి. ప్రపంచ దేశాల ముందు భారత్‌పై పాకిస్తాన్‌ చేసిన ఆరోపణలు బెడిసికొట్టాయి. పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వబోమంటూ ప్రపంచ దేశాలు సైతం తేల్చి చెప్పాయి.

Next Story