అంబులెన్స్‌లో వచ్చి మరీ శతకం..
By తోట వంశీ కుమార్ Published on 1 Aug 2020 7:06 PM ISTటీమ్‌ఇండియా మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ ఓ మ్యాచ్‌లో అంబులెన్స్‌లో వచ్చి మరీ శతకం బాదాడని, మరో మ్యాచ్‌లో గంటలో సెంచరీ చేస్తానని చెప్పి చేశాడని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీ తెలిపాడు. భారత స్పిన్నర్ అశ్విన్ నిర్వహించే ఫార్ములా ఫర్ సక్సెస్ అనే యూ ట్యూబ్ ఫోలో బాలాజీ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. బద్రీనాథ్ గురించి అడుగగా.. రంజీ క్రికెట్‌లో ఆడే రోజుల నుంచి బద్రీ తనకు తెలుసునని చెప్పాడు బాలాజీ.
అతడు చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తాడని అంటారని, కానీ అతడితో మరో కోణం కూడా ఉందన్నాడు. బద్రీ కాలేజ్ డేస్ నుంచే నెమ్మదిగానే ఆడేవాడని.. అయితే.. అంత తేలిగ్గా వికెట్ ఇచ్చేవాడు కాదన్నాడు. రంజీ ట్రోఫీలో తన తొలి మ్యాచ్‌లోనే ఒక సెషన్‌లో శతకం ఎలా బాదగలడో చూపించాడన్నాడు. మ్యాచ్‌కు ముందే మరో గంటలో శతకం బాదుతానని తనతో చెప్పినట్లు బాలాజీ గుర్తుచేసుకున్నాడు. అతను వేగంగా బ్యాటింగ్ చేయగలడన్నారు.
'ఒకసారి మహారాష్ట్రలో ఆడేటప్పుడు బద్రీనాథ్ డీహైడ్రేషన్‌కు గురైతే.. మలార్ ఆస్పత్రికి వెళ్లాడు. తమిళనాడు వికెట్లు కోల్పోయినప్పుడు అంబులెన్స్‌లో వచ్చి మరీ శతకం బాదాడు. ఆ సెంచరీతో జట్టును కాపాడాడు. బద్రీ గురించి ఈ విషయాలన్నీ ఎవరికీ తెలియవు. అతడు చాలా చేయగలడు' అని మాజీ పేసర్ బాలాజీ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బద్రినాథ్ ప్రాతినిథ్యం వహించాడు. 2010, 2011లో చెన్నై టైటిల్ విజేతగా నిలవడంతో తనవంతు పాత్ర పోషించాడు. బద్రీనాథ్ 2018లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.