‘బాబ్రీ’ తీర్పు గడువు సెప్టెంబర్ 30కు పొడిగింపు
By మధుసూదనరావు రామదుర్గం Published on 23 Aug 2020 6:14 AM GMTబాబ్రీ మసీదు కేసుకు సంబంధించిన తీర్పు గడువును సెప్టెంబరు30 దాకా పొడిగించాలని సుప్రీం కోర్టు సీబీఐ కోర్టుకు సూచించింది. ఈ కేసులో సీనియర్ బీజేపీ నాయకులు ఎల్.కె. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, కల్యాణ్ సింగ్‌లు క్రిమినల్ చార్జీలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. జస్టిస్ రోహింటన్ నారిమన్, నవీన్ సిన్హా, ఇందిరా బెనర్జీలతో కూడిన బెంచ్ సీబీఐ కోర్టు.. తీర్పు గడువును నెలపాటు అంటే సెప్టెంబరు 30 దాకా పొడిగించాలని సూచించింది. స్పెషల్ జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ తీర్పుకు సంబంధించిన ప్రొసీడింగ్‌లు పూర్తి కావస్తున్నాయంటూ సమర్పించిన నివేదికను పరిశీలించిన బెంచ్ మరికొంత వ్యవధి అవసరమని భావించి నెలపాటుతీర్పును వాయిదా వేయాల్సిందిగా కోరింది.
‘స్పెషల్ జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ నివేదిక చదివాక ప్రొసీడింగ్‌లు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తీర్పు గడువును మరో సెప్టెంబరు 30 దాకా పొడిగిస్తున్నామని సుప్రీం కోర్టు బెంచి ఈనెల 19న ప్రకటించిన ఉత్తర్వులో పేర్కొంది.
గత మే 8న జస్టిస్ నారిమన్, సూర్యకాంత్‌లతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్, స్పెషల్ జడ్జి అభ్యర్థనను పరిగణించి లక్నోలోని స్పెషల్ సీబీఐ కోర్టుకు తీర్పు గడువును ఆగస్టు 30 దాకా పొడిగించింది. స్పెషల్ జడ్జి సురేంద్ర యాదవ్ మే 6న ఇచ్చిన నివేదికలో తీర్పుకు సంబంధించి సాక్ష్యాధారాల రికార్డింగ్ పూర్తి కాలేదని తెలిపారు. ఆ సమయంలో వీడియో కాన్పెరెన్స్ ద్వారా ప్రొసీడింగ్‌లను ముగించాలని, మళ్ళీ తీర్పు వాయిదా కోరరాదని బెంచి తెలిపింది.
2019 జులై 19న ఈ బెంచే సాక్ష్యాధారాలను ఆరునెలల్లోగా పూర్తి చేసి, తొమ్మిది నెలలకల్లా తీర్పు ప్రకటించాలని ట్రయల్ కోర్టును నిర్దేశించింది. ఇదే సమయంలో లక్నోలోని సీబీఐ కోర్టు స్పెషల్ జడ్జి 2019 సెప్టెంబరు30 రిటైర్ కావల్సి ఉండగా.. వారి పదవీ కాలాన్ని తీర్పు వెలువడే దాకా పొడిగించాలని యూపీ ప్రభుత్వానికి మార్గనిర్దేశనం చేసింది. 1992లో జరిగిన బాబ్రీమసీదు కూల్చివేతకు సంబంధించి బీజేపీ సీనియర్ నాయకులు ఎల్.కె. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి మరో 13 మంది క్రిమినల్ చార్జీలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
2017 ఏప్రిల్ 19న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ పి.సి. ఘోష్, ఆర్.ఎఫ్. నారిమన్‌లతో కూడిన బెంచ్ పరిశీలించి ఆరోపితులపై కేసును పునరుద్దరిస్తున్నట్లు తెలిపింది. రాజ్యాంగం లోని 142వ ఆర్టికల్ ప్రకారం రాయబెరలీ మేజిస్ట్రేట్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న ప్రత్యేక ట్రయల్‌ని లక్నో సీబీఐ కోర్టులోని క్రిమినల్ ప్రొసీడింగ్‌తో జతపరుస్తూ బదిలీ చేసింది. అంతేకాదు ప్రతిరోజూ ట్రయల్ నిర్వహించాల్సిందిగా సుప్రీం ఆదేశించింది.
అయోధ్య– బాబ్రీమసీద్‌కు సంబంధించిన 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని రామమందిర నిర్మాణానికే వినియోగించాల్సిందిగా అయిదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం 2019 నవంబరు 8న తుది తీర్పు వెలువరించింది. అలాగే మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్‌బోర్డుకు కేటాయించాలని తీర్పులో పేర్కొంది. 1992లో బాబ్రీ కూల్చివేత చట్టవ్యతిరేక చర్యగా అప్పట్లో కోర్టు గుర్తించింది. అలాగే 1949 యాక్ట్ ఆఫ్ డిసెక్రేషన్ ప్రకారం మసీదులో విగ్రహాలను ప్రతిష్ఠించడం కూడా చట్ట వ్యతిరేకమేనని సీజేఐ రంజన్ గోగయ్, జస్టిస్ బోబ్డే, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.