కశ్మీర్ పై జైషే పడగ -1

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Oct 2019 2:59 PM GMT
కశ్మీర్ పై జైషే పడగ -1

కశ్మీర్‌ను భారతదేశం నుంచి వేరు చేయాలన్నదే అతని లక్ష్యం. వేదభూమిని నిప్పులకుంపటిగా మార్చాలన్నదే అతని కుతంత్రం. యువతలో విషబీజాలు నాటి, ఉగ్రవాద బోధనలతో ప్రేరేపించి మారణహోమాలతో రక్తపుటేరులు పారిస్తున్నాడు. అతన్ని అప్పగించాలని భారతదేశం ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్నా దాయాది దేశం మాత్రం అబ్బే మాకేం సంబంధం లేదు అంటూ బుకాయిస్తోంది. అంతర్జాతీయ సమాజం నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ నాయకుడు మసూద్ అజర్‌పై స్పెషల్ ఫోకస్..

మౌలానా మసూద్ అజర్... ప్రపంచవ్యాప్తంగా ఈ పేరుపై చర్చ జరుగుతూనే ఉంటుంది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో మసూద్అజర్ మళ్లీ హాట్ టాపిగ్గా మారాడు. అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించి, నిషేధం విధించాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న మసూద్ అజర్ 1968లో తూర్పు పాకిస్తాన్‌-పంజాబ్ ప్రావిన్స్‌లోని భవహాల్‌పూర్‌లో జన్మించాడు. అజర్‌ తండ్రి అల్లా షబ్బీర్‌ ప్రభుత్వ పాఠశాల ప్రధా నోపాధ్యాయునిగా పని చేసి పదవీ విరమణ పొందాడు. అజర్ కుటుంబం పాలవ్యాపారం చేస్తూ కోళ్ల పెంపకం చేసేది. కరాచీలోని బినోరీ సిటీలో మతపరమైన జామియా ఉలూమ్-ఇ-ఇస్లామీ యూనివర్సిటీలో చదివిన మసూద్, 1989లో డిగ్రీ పట్టా పొందాడు. తర్వాత స్కూల్‌ టీచర్‌గా కొన్నాళ్ల పాటు సేవలందించాడు. డిగ్రీ చదువుతున్నప్పుడే మసూద్ దృష్టి జిహాదీ ఉగ్రవాదంపై పడింది. కరాచీలో ఉన్నప్పుడే ఆఫ్ఘనిస్తాన్‌లో జీహాద్ ట్రైనింగ్ కోర్స్ తీసుకోమని తనకు సూచించారని ది వర్చూస్ ఆఫ్ జీహాద్ అనే తన పుస్తకంలో మసూద్ స్వయంగా పేర్కొన్నాడు. అలా యూత్ స్టేజ్ లోనే ఉగ్రవాదం వైపు మళ్లిన మసూద్, మళ్లీ ఆ దారి నుంచి వెనక్కి రాలేదు.

90వ దశకంలో మసూద్ జమ్మూ కశ్మీర్లో ప్రవేశించాడు. 1994లో పోర్చుగీస్‌ పాస్‌పోర్టుతో కశ్మీర్‌లో అడుగుపెట్టాడు. అప్పుడు అతని వేషధారణ ముఖ కవళికలను చూసిన పాస్ పోర్ట్ విభాగం అధికారులు అనుమానంతో ప్రశ్నించగా, తాను గుజరాతీ మూలాలున్న పోర్చుగీసు వాసినని చెప్పి బురిడీ కొట్టించాడట. అలా కశ్మీర్‌లో కాలు మోపిన మసూద్, కశ్మీరీ మిలిటెంటు గ్రూపుల మధ్య తగాదాలను పరిష్కరిస్తు పెద్దమనిషిగా చలామణీ అయ్యాడు. క్రమంగా వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించి ఉగ్రవాదాన్ని ఎగదోశాడు. ఐతే, మసూద్ మంత్రాంగం ఎంతోకాలం సాగలేదు. ఉగ్రవాద కార్య కలాపాలు నిర్వహిస్తున్నాడనే ఆరోపణలపై 1994లోనే మసూద్ అజర్ అరెస్టయ్యాడు. హర్కతుల్ ముజాహిదీన్ మిలి టెంట్ గ్రూప్ కోసం శ్రీనగర్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే అభియోగాలపై మసూద్ అజర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, అతన్ని జైలుకు తర లించారు.

జైలులో ఉన్నన్నాళ్లు తప్పించుకునేందుకు మసూద్ అజర్ విశ్వప్రయత్నాలు చేశాడు. తనను ఎక్కువకాలం జైలులో ఉంచలేరూ అని జైలు అధికారులతో మసూద్ చెప్పేవాడట. తనను విడిపించుకుపోతారని కూడా పదే పదే అనేవాడట. జైలు నుంచి తప్పించుకునేందుకు మసూద్‌ అజర్‌తో పాటు మరికొందరు ఉగ్రవాదులు పెద్ద సొరంగం తవ్వి పారిపోయేందుకు ప్రయత్నించారు. సొరంగం తవ్వినప్పటికీ, మసూద్ లావుగా ఉండడంతో అందులో ఇరుక్కుపోయి దొరికిపోయాడు. 1994లో ఢిల్లీలో హర్కతుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు, అమెరికా, బ్రిటిష్ దేశస్థులను కిడ్నాప్ చేసింది. మసూద్ ను వదిలిపెడితే గానీ విదేశీ పర్యాటకులను వదిలిపెట్టబోమని హెచ్చరించింది. ఐతే మసూద్ ను వదిలిపెట్టకుండానే భద్రతా బలగాలు పని పూర్తి చేశాయి. మళ్లీ 1995 జులైలో టెర్రరిస్టులు, ఇద్దరు పర్యాటకులను కిడ్నాప్ చేసి అజర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్లాన్ కూడా ఫెయిలైంది. కానీ 1999లో మాత్రం మసూద్ తప్పించుకోగలిగాడు.

మసూద్ అజర్ ను విడిపించడానికి టెర్రరిస్టులు ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. చివరికి 1999 డిసెంబరులో ఐసీ-814 విమానాన్నిహైజాక్ చేశారు. ప్రయాణికులను వదిలిపెట్టాలంటే మసూద్ అజర్ తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను వదిలి పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆ పరిస్థితుల్లో ప్రయాణికుల భద్రతే ముఖ్యమనుకున్న ప్రభుత్వం, తర్జనభర్జనల తర్వాత మసూద్ అజర్ తో పాటు మరో ఇద్దరు మిలిటెంట్లను వదిలిపెట్టింది. వారిని హైజాకర్లకు అప్పగించి ప్రయాణికులను సురక్షితంగా విడిపించింది. అలా భారతీయ జైలు నుంచి బయటపడిన మసూద్ అజర్, ఆ తర్వాత భారతదేశంలో ఎన్నో మారణహోమాలకు పాల్పడ్డాడు. కశ్మీరీ లోయలో రావణకాష్టాన్ని రగిల్చి, వందలమంది అమాయక యువతతో తుపాకులు పట్టించాడు.

Next Story