వైభవంగా అయోధ్య భూమిపూజ
By తోట వంశీ కుమార్ Published on 5 Aug 2020 8:12 AM GMTకోట్లాది మంది హిందువుల చిరకాల వాంఛ నెరవేరేందుకు తొలి అడుగు పడింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి పునాది రాయి పడింది. శ్రీరాముడి జన్మస్థానంలోనే అపురూపమైన ఆలయం నిర్మాణం కాబోతోంది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, రాములోరి శ్లోకాలు మధ్య ప్రధాని నరేంద్ర మోదీ రామమందిరం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, సీఎం యోగి ఆధిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీప్ మోహన్ భగవత్, ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్, ఇతర ప్రముఖులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భూమి పూజలో నక్షత్రాకరంలో ఉన్న అయిదు వెండి ఇటుకలను ఉపయోగించారు. ఆ వెండి ఇటుకలు 5 విగ్రహాలకు ప్రాతినిధ్యం వహిస్తాయని ఆగమ పండితుల భావన. హరిద్వార్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలం పుణ్యనదీ జలాలను పూజలో వినియోగించారు.
అంతకముందు అయోధ్య చేరుకున్న మోదీ.. మొదట హనుమాన్ గఢీ ఆలయానికి వెళ్లారు. అక్కడ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రధాని అయోధ్య రామాలయం వద్దకు చేరుకున్నారు. రామాలయంలోని ఉత్సవ విగ్రహానికి పూజ చేశారు. అనంతరం పారిజాత మొక్కను నాటారు. తర్వాత భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులు అందరూ.. భూమిపూజ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. రామ నామ స్మరణతో అయోధ్య మార్మోగుతోంది.