మోదీ అయోధ్య టూర్ షెడ్యూల్.. రామ మందిరం కోసం కోటి రూపాయలు విరాళం ఇచ్చిన శివ సేన
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Aug 2020 9:32 PM ISTఅయోధ్యలో రామ మందిరం నిర్మాణ భూమి పూజ కోసం హిందూ బంధువులంతా ఎదురుచూస్తూ ఉన్నారు. కరోనా పరిస్థితులు లేకుండా ఉండి ఉంటే మరింత అంగరంగ వైభవంగా భూమి పూజ కార్యక్రమం జరిగి ఉండేది. భూమి పూజ కోసం పలువురు ప్రముఖులు ఇప్పటికే అయోధ్యకు చేరుకుంటూ ఉన్నారు.
రామ మందిరం నిర్మాణం కోసం విరాళాలు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. శివ సేన కోటి రూపాయలు రామ మందిరం నిర్మాణం కోసం విరాళం ఇచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివ సేన పార్టీ ప్రెసిడెంట్ ఉద్ధవ్ థాక్రే గతంలోనే ఈ విరాళాన్ని ప్రకటించారని శివసేన వర్గాలు తెలిపాయి. ఆ డబ్బును శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బ్యాంకు అకౌంట్ కు రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ ద్వారా పంపించారు. ఈ విషయాన్ని శివసేన తమ అధికారిక సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతూ రామ మందిరం భూమి పూజ కోసం కోట్లాది మంది ఎదురుచూస్తూ ఉన్నారని.. ఇదొక చారిత్రాత్మక ఘటన అని చెప్పుకొచ్చారు.
ఆలయ నిర్మాణం జరిగే ప్రదేశంలో సోమవారం 12 మంది పూజారులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. గణపతి పూజ జరిపారు. సోమవారం ప్రారంభమైన పూజా కార్యక్రమాలు మూడు రోజుల పాటు కొనసాగి.. బుధవారంతో ముగియనున్నాయి. బుధవారం మధ్యాహ్నం ప్రధాని మోదీ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు.
భూమి పూజ కార్యక్రమ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ట్రస్ట్ చీఫ్ నృత్య గోపాలదాస్ మహారాజ్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రమే ఉంటారు.
బుధవారం నాడు మోదీ ప్రత్యేక జెట్‌లో ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరతారు. 10.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో మోదీ అయోధ్యకు బయలుదేరతారు. 11.30లకు ఆయన అయోధ్య చేరుకుంటారు. 11:40 గంటలకు హనుమాన్‌గడి ఆలయంలో పూజలు చేయనున్నారు. 10వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో ఆయన ఏడు నిమిషాల పాటు గడపనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రామజన్మభూమి ప్రాంతానికి ప్రధాని చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12:30 నుంచి 12:40 వరకు భూమి పూజ జరుగుతుంది. మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుంది. 2:15 గంటలకు తిరిగి ఢిల్లీకి ప్రధాని పయనమవుతారు.