కరోనా లక్షణాలు లేని వారిలోనే ఎక్కువగా వైరస్ కణాలు.. జాగ్రత్త వహించాల్సిందే

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Sept 2020 7:06 AM IST
కరోనా లక్షణాలు లేని వారిలోనే ఎక్కువగా వైరస్ కణాలు.. జాగ్రత్త వహించాల్సిందే

కరోనా లక్షణాలు లేని వారి శరీరంలోనే లోనే కోవిద్-19 వైరస్ ఎక్కువగా ఉంటోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీరి కారణంగానే కోవిద్-19 వ్యాప్తి అధికంగా ఉండడమే కాకుండా వేగంగా భారతదేశంలో విస్తరిస్తోందని తాజా స్టడీ ద్వారా తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (సి.డి.ఎఫ్.డి.) నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్(ఎన్.సి.బి.ఎస్) నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కలిసి చేసిన స్టడీలో సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి.

భారతదేశంలో ఇన్ఫెక్షన్ రేటు అధికంగా ఉండడానికి, చనిపోయే వారి శాతం తక్కువగా ఉండడానికి గల కారణాలు వారు తెలుసుకోడానికి ప్రయత్నించారు. కోవిద్-19 లక్షణాలు కనిపించకుండా ఉండడంతో వారు ప్రజల్లో ఎక్కువగా తిరుగుతూ ఉండడం వలన కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. సి.డి.ఎఫ్.డి. హైదరాబాద్ లోని టెస్టింగ్ సెంటర్స్ లో ఒకటి. స్టడీ కోసం రెండు వందలకు పైగా నమూనాలను సేకరించి ఈ విషయాన్ని గుర్తించారు.

ఎటువంటి రోగ లక్షణాలు లేని రోగుల్లో అధిక వైరస్ కణాల సంఖ్య గమనించినట్టు వారు తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారిలో వైరస్ కణాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు ఇప్పటివరకూ జరిగిన అధ్యయనాలు చెప్పినప్పటికీ అధ్యయనంలో ఇందుకు విరుద్ధమైన ఫలితం రావడం ఆశ్చర్యకరమని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీకి చెందిన శాస్త్రవేత్త సత్యజీత్ రథ్ తెలిపారు. ముఖ్యంగా లక్షణాలు లేనివారి నుంచి తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని, అలాంటి సమయంలోవారు తీవ్ర అనారోగ్యానికి గురి అవుతారని.. ఒక్కోసారి మరణానికి కూడా దారితీస్తుందని సీడీఎఫ్‌డీకి చెందిన పరిశోధకులు భావిస్తూ ఉన్నారు.

కరోనా లక్షణాలు లేకున్నప్పటికీ పాజిటివ్ అని నిర్ధారణ అయిన వారి విషయంలో ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా లక్షణాలు లేకున్నప్పటికీ పాజిటివ్ వచ్చిన వారిని కలిసిన ప్రైమరీ, సెకెండరీ కాంటాక్టులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాలని అంటున్నారు.

నమూనాలు సేకరించిన రోగుల్లో దాదాపు 95 శాతం 20బీ స్టెయిన్ వైరస్ ఉండగా, మిగితావి వేరే రకాలకు చెందిన వైరస్‌లుగా తేల్చారు. ఈ ప్రాంతంలోనే వైరస్ వ్యాప్తి జరగడానికి అతి ఎక్కువ ప్రాబల్యం కలిగిన డీ614జీ రకం వైరస్ కారణమనే అనుమానాన్ని కూడా శాస్త్రవేత్తలు వ్యక్తం చేశారు. 20బీ, 19ఏ, 20ఏ అంటూ వైరస్ లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. 19ఏ చైనాలోని వుహాన్ లో ప్రభావితం చేయగా.. 20ఏ యూరప్ లో ప్రభావం చూపింది.

Next Story