షారూక్ ఇస్టయిల్లో సామాజిక సందేశం 'అస్సాం పోలీస్ సినిమా టచ్'
By మధుసూదనరావు రామదుర్గం Published on 21 July 2020 8:51 AM ISTఅస్సాం పోలీస్ తాజాగా ట్విటర్ లో సినిమా టెక్నిక్ వాడారు. కరోనా గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ట్వీట్ లో షారూక్ ఖాన్ తన స్టైల్ లో నిలుచున్న బొమ్మ పెట్టి దాని పైన 6 అడుగుల భౌతిక దూరం అని క్యాప్షన్ పెట్టారు. షారూఖాన్ మొహానికి ఫోటోషాప్ సాయంతో మాస్క్ వేశారు. ఆ పిక్ తోపాటు బాజీగర్ లోని ఫేమస్ డైలాగ్ రాశారు.
షారూక్ రెండు చేతులు చాచిన పోజుకు ఆరు అడుగుల భౌతిక దూరం ఇలా ఉండాలి.. అప్పుడే కరోనా పారిపోతుంది అని వివరించారు. భౌతిక దూరం ప్రాణాలను కాపాడుతుంది.. దగ్గరవాలంటే అప్పుడప్పుడు ఇలా దూరం ఉండాలంటారు.. దూరాన ఉండికూడా దగ్గరగా ఉండే వారిని బాజీగర్ అంటారు.. (కభీకభీ పాస్ ఆనే కేలియే కుచ్ దూర్ జానా పడ్తా హై, ఔర్ దూర్ జాకర్ పాస్ ఆనే వాలోన్ కో బాజీగర్ కహతే హై) ఆరడుగుల దూరం పాటించండి బాజీగర్ లా బతకండి అంటూ ట్వీట్ చేశారు.
కరోనా విలయ సమయంలో చాలా మంది సోషల్ మీడియా, ట్విటర్లలో సందేశాలివ్వడానికి షారూక్ బొమ్మల్ని ప్రభావాత్మకంగా వాడుకున్నారు. గతంలో ముంబై పోలీస్ తన ట్విటర్ లో మైహూనా సినిమా క్లిప్ వాడుకున్నాడు. ఈ సినిమాలో సతీష్ షా సెల్వా నుంచి తప్పించుకునే సీన్ పెట్టి.. ఇకపై ఇంత శ్రమ అక్కర్లేదు మాస్క్ ఉందిగా అని ట్వీట్ లో కామెంట్ పెట్టారు.
ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఏ వుడ్ అయినా ఒక్కొక్క హీరో నటనా శైలి ఒక్కోరీతిగా ఉంటుంది. తెలుగు సినిమాలో ఎన్టీఆర్ కుడిచేయి నడుంపై పెట్టి ఎడమచేతిని పైకెత్తి అటూ ఇటూ ట్విస్ట్ చేయడం ఒక స్టైల్ అయితే, అక్కినేని నాగేశ్వరరావు ఓ చేత్తో కాలర్ బటన్ పట్టుకుని మరోచేయి చూపుడు వేలును స్టైల్ గా పైకెత్తి.. లతా ఎందుకిలా చేశావ్ అనే డైలాగ్ చెబితేచాలు సినిమా హాల్ కేకలతో ఈలల్తో దద్దరిల్లి పోయేది. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖాన్ సిగ్నేచర్ స్టైల్ చాలా వినూత్నంగా ఉంటుంది. రెండు చేతులు విశాలంగా చాచి కాస్త క్రాస్ గా నిలుచుని ఓ నవ్వు నవ్వితే చాలు.. అది షారూఖాన్ సిగ్నేచర్ స్టైల్ అవుతుంది. బాజీగర్, మైహూనా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవి తీసుకున్నా ఏదో ఒక సీన్ లో ఈ సిగ్నేచర్ స్టైల్ తప్పక కనిపిస్తుంది. ఇవి ఎంత ప్రఖ్యాతం అంటే వీటిపై బోల్డన్ని మెమ్స్ వచ్చాయి.. వస్తుంటాయి. కాకపోతే కరోనా పై ప్రజలకు స్పృహ కలిగించే సందేశాలకు వీటిని జతపరచడం మంచి సృజనాత్మకత. చూసిన వెంటనే కాసింత నవ్వు తెప్పించినా ఇలాంటివే ప్రజల గుండెను నేరుగా తాకుతాయి.