విషాదం: విరిగిపడ్డ కొండచరియలు.. 20 మంది మృతి
By సుభాష్
అసోంలో దారుణం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి 20 మంది మృత్యువాత పడ్డారు. మంగళవారం మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో 20 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బంగ్లాదేశ్ సరిహద్దులోని కరీమ్‌గంజ్ జిల్లాలోని కలియాగంజ్‌లో కొండచరియలు విరిగిపడి ఆరుగురు, కాచర్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు, హైలాకాండి జిల్లాలో ఏడుగురు మృతి చెందారు.
కాగా, విషయం తెలుసుకున్న ఎన్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై అసోం ముఖ్యమంత్రి సద్బానంద్ సోనోవాల్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.