బాబ్రీ మసీదు దానంతట అదే కూలిపోయిందా.?: అసదుద్దీన్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Sep 2020 10:16 AM GMT
బాబ్రీ మసీదు దానంతట అదే కూలిపోయిందా.?: అసదుద్దీన్

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె.అద్వానీ (92), మురళీ మనోహర్ జోషి(86), ఉమా భారతితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా నిర్దోషులుగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది.

ఈ తీర్పుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ న్యాయవ్యవస్థకు ఈరోజు ఒక చీకటి రోజు అని.. సీబీఐ కోర్టు తీర్పు బాధాకరమని అన్నారు. మసీదు కూల్చివేత వెనక ఎలాంటి కుట్ర లేదని ఈరోజు కోర్టు తెలిపిందని.. అయోధ్యలో వివాదాస్పద భూమికి సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ... చట్టాలను ఉల్లంఘించారని, పద్ధతి ప్రకారం ప్రార్థనా స్థలాన్ని నాశనం చేశారని వ్యాఖ్యానించిందనే విషయాన్ని గుర్తు చేశారు.

అందరూ నిర్దోషులైతే.. మసీదును కూల్చింది ఎవరని ప్రశ్నించారు. బాబ్రీ మసీదు దానంతట అదే కూలిపోయిందా? అని అడిగారు. మసీదును ఎవరు కూల్చారో ప్రపంచమంతా చూసిందని అన్నారు. మసీదును కూల్చండి అని ఉమా భారతి నినాదాలు చేశారని.. ఈ తీర్పుపై సీబీఐ హైకోర్టుకు వెళ్లాలని చెప్పారు.

సీబీఐ కోర్టు తీర్పుపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. 'హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్లు నిర్దోషులుగా ప్రకటించబడ్డారు. న్యాయాన్ని భూస్థాపితం చేశారు. సరికొత్త భారత్' అని ట్వీట్ చేశారు.

లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానంలోని కోర్టు రూమ్‌ నంబరు 18లో సీబీఐ జడ్జి సురేంద్ర కుమార్‌ యాదవ్ బాబ్రీ మసీదు‌ తుది తీర్పును చదివి వినిపించారు. ఈ కేసులో 2 వేల పేజీల జడ్జిమెంట్‌ కాపీని రూపొందించారు. కాగా ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న వినయ్‌ కతియార్, సాక్షిమహారాజ్‌, ధరమ్‌దాస్‌, రామ్‌ విలాస్‌ వేదాంతి, లల్లూ సింగ్, పవన్ పాండ్యా తదితరులు కోర్టుకు చేరుకున్నారు. ఇక మాజీ ఉపప్రధాని ఎల్‌కే అద్వానీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్‌ జోషి, కళ్యాణ్‌‌ సింగ్‌, సతీశ్‌ ప్రధాన్‌, గోపాల్‌ దాస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ఎదుట హాజరయ్యారు.

Next Story
Share it