సంచ‌ల‌నం.. స‌మ‌స్య స‌మాప్తం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Sep 2020 7:25 AM GMT
సంచ‌ల‌నం.. స‌మ‌స్య స‌మాప్తం

బాబ్రీ మసీదు విషయంలో ఈరోజంతా హై టెన్షన్ నెలకొన్న సంగతి తెలిసిందే..! తీర్పు ఎలా వస్తుందా అని అందరూ ఎదురు చూశారు. దాదాపు 28 సంవత్సరాలకు పైగా కేసు కోర్టుల్లో నడిచింది. ఈ రోజు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితులపై సీబీఐ అభియోగాలు నిరూపించలేకపోయిందని కోర్టు తెలిపింది. దీంతో నిందితులు అందరిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తున్నట్లు తెలిపింది.

మసీదు కూల్చివేత కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె.అద్వానీ (92), మురళీ మనోహర్ జోషి(86), ఉమా భారతితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా నిర్దోషులుగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి సురేంద్ర కుమార్‌ యాదవ్‌ తీర్పును వెల్లడించారు.

లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానంలోని కోర్టు రూమ్‌ నంబరు 18లో సీబీఐ జడ్జి సురేంద్ర కుమార్‌ యాదవ్‌ తుది తీర్పును చదివి వినిపించారు. ఈ కేసులో 2 వేల పేజీల జడ్జిమెంట్‌ కాపీని రూపొందించారు. కాగా ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న వినయ్‌ కతియార్, సాక్షిమహారాజ్‌, ధరమ్‌దాస్‌, రామ్‌ విలాస్‌ వేదాంతి, లల్లూ సింగ్, పవన్ పాండ్యా తదితరులు కోర్టుకు చేరుకున్నారు. ఇక మాజీ ఉపప్రధాని ఎల్‌కే అద్వానీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్‌ జోషి, కళ్యాణ్‌‌ సింగ్‌, సతీశ్‌ ప్రధాన్‌, గోపాల్‌ దాస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ఎదుట హాజరయ్యారు.

ఉమా భారతికి కరోనా సోకగా, వయో భారం, అనారోగ్యం కారణంగా ఎల్‌కే అడ్వాణీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్‌ జోషి సైతం న్యాయస్థానం ఎదుట స్వయంగా హాజరుకాలేకపోయారు. కాగా దేశ వ్యాప్తంగా ప్రకంప‌నలు రేపిన 1992 నాటి బాబ్రీ ఘటన తీర్పు నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్ర‌మ‌త్తం చేసింది. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.

16వ శతాబ్దం నాటి మసీదును కూల్చేలా కరసేవకులను ఉసిగొల్పేందుకు వీరు కుట్ర పన్నారని సీబీఐ ఆరోపించింది. రాజకీయ ప్రతీకార చర్యలో భాగంగానే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ కేసులో ఇరికించిందని, మేము నేరం చేశామనడానికి ఎలాంటి ఆధారం లేదని విచారణలో భాగంగా నిందితులు వాదించారు. తాజా తీర్పుతో వారందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Next Story
Share it